- మైసూరు జూ నుంచి తరలించేలా ఏర్పాట్లు
- ఇప్పటికే గుజరాత్ నుంచి మూడు జీబ్రాలు రాక
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు త్వరలో లేడీ జిరాఫీని తీసుకురానున్నారు. ఇప్పటికే గుజరాత్ నుంచి తీసుకొచ్చిన మూడు జీబ్రాలను ఎన్‌క్లోజర్‌లోకి తీసుకొచ్చి సందర్శకులకు అందుబాటులో ఉంచారు. వీటిని గుజరాత్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా జంతు మార్పిడి కింద 20 మూషిక జింకలకు బదులుగా వంటారా విభాగమైన రాధాకృష్ణ ట్రస్ట్ నుంచి తీసుకొచ్చారు. కాగా, 35 ఏండ్ల తర్వాత జీబ్రాలు రావడంతో నెహ్రూ జూ పార్కు కళకళలాడుతున్నది. ప్రస్తుతం జూకు మూడు జీబ్రాలను తీసుకురాగా.. ఇందులో రెండు ఆడ, ఒక మగ ఉన్నాయి. అంతేకాకుండా, త్వరలో మైసూరులోని జూ నుంచి ఆడ జిరాఫీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి నుంచి జిరాఫీని తరలించడంతోపాటు దానికి బదులుగా రైనోను ఇవ్వనున్నారు. జిరాఫీ తన పొడవైన మెడ, దట్టమైన మచ్చలతో జూకు కొత్త అందాన్ని తీసుకురానున్నది. ప్రస్తుతం జూలో మగ జిరాఫీ సన్నీ ఒంటరిగా ఉంటున్నది. దీనికి జతగా ఆడ జిరాఫీని తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆరోగ్యం, ఆహారంపై ఫోకస్
ప్రస్తుతం నెహ్రూ జూలో 199 జాతుల జంతు, పక్షి జాతులున్నాయి. ఇందులో 1,361 పక్షులు, 328 పాములు, 518 ఇతర జంతువులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. కొత్తగా వచ్చే జంతువులతో వీటి సంఖ్య మరింత పెరగనున్నది. కాగా, జూ అధికారులు జంతువుల ఆరోగ్యం, ఆహారంపై స్పెషల్ ఫోకస్ పెట్టి వాటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి జంతువు ఆరోగ్యానికి అనుగుణంగా ప్రత్యేక మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రతి జంతువు ఆరోగ్యం, బ్రీడింగ్ అవసరాలకు అనుగుణంగా మెనూ రూపొందిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పశువైద్యుల బృందం నిరంతరం జంతువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది.
