- పలు రాష్ట్రాలకు కరవు..తీరాల్లో వరద సూచనలు
న్యూఢిల్లీ: గత కొన్నేండ్లుగా చల్లగా ఉన్న పసిఫిక్ మహాసముద్రం ఇప్పుడు మళ్లీ వేడెక్కుతున్నది. మహాసముద్రం ఉపరితల టెంపరేచర్లు పెరగడంతో 'ఎల్ నినో' ప్రక్రియ తీవ్రరూపం దాల్చుతున్నది. అయితే, ఈసారి రాబోయేది సాదాసీదా ఎల్‌నినో కాదని.. గత 150 ఏండ్ల ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టే స్థాయి కలిగిన 'సూపర్ ఎల్‌నినో' అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం)కి చెందిన ప్రముఖ క్లైమేట్ సైంటిస్ట్ రాక్సీ మాథ్యూ కొల్ హెచ్చరించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ.. మానవ తప్పిదాల(కార్బన్ ఉద్గారాలు)వల్ల ఉత్పన్నమైన వేడిలో 90% పైగా టెంపరేచర్‌ను సముద్రాలే శోషించుకుంటాయి. ఈసారి వేడి విపరీతంగా పెరగడంతో ఎల్‌నినో శక్తిమంతంగా మారింది. ఫలితంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరవు పరిస్థితులు, తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడనున్నాయి.
ఆహార, ఇంధన సంక్షోభం
సముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడాన్నే ‘ఎల్‌నినో’ అంటారు. ఇది జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులొస్తాయి. అయితే, సముద్రపు నీటి ఉష్ణోగ్రత అసాధారణం కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే దాన్ని ‘సూపర్ ఎల్‌నినో’గా పరిగణిస్తారు.
గతంలో 1982, 1997, 2015 లో ఇటువంటి భారీ మార్పులు సంభవించాయి. అయితే, ఈ ఏడాది రాబోయేది గత 150 ఏండ్లలోనే అత్యంత శక్తిమంతమైనదిగా ఉండవచ్చని అంచనా వేశారు. దీనివల్ల సెంట్రల్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేసియా దేశాల్లో తీవ్ర కరవు, అడవుల్లో మంటలు సంభవిస్తాయి.
మరోవైపు, పసిఫిక్ తూర్పు ప్రాంతంలోని తేమ కారణంగా పెరూ, బ్రెజిల్, తూర్పు ఆఫ్రికా దేశాల్లో కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తుతాయి. ఈ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం పెరిగి.. అంతర్జాతీయంగా ఇంధన, ఆహార ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది.
భారత్‌లో ఓవైపు కరవు, మరోవైపు కుండపోత
భారతదేశానికి జీవనాధారమైన నైరుతి రుతుపవనాలపై ఈ సూపర్ ఎల్ నినో ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతోందని రాక్సీ మాథ్యూ కొల్ చెప్పారు. ఈ నెల26 నాటికే రుతుపవనాలు దేశాన్ని తాకాల్సి ఉంది. అయితే, ఎల్‌నినో వల్ల రుతుపవన గాలులు బలహీనపడి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదుకానుంది.
ఫలితంగా మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, జార్ఖండ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో కరవు పరిస్థితులు ఏర్పడి, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ముప్పు ఉంది. అయితే, ఇదే సమయంలో అరేబియా సముద్రం కూడా వేడెక్కి ఉండటం వల్ల బలహీనమైన రుతుపవన గాలులు సైతం అత్యధిక తేమను మోసుకొస్తాయి.
ఇవి దేశం లోపలికి చొచ్చుకుపోలేక.. కేవలం దక్షిణ తీర ప్రాంతాలకే పరిమితమై అతి తక్కువ సమయంలోనే కుండపోత వర్షాలను కురిపిస్తాయి. ఇలా హఠాత్తుగా పడే వరద నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకపోవడంతో.. వాన ఆగిన వెంటనే నేల ఎండిపోవడం, నదులు అడుగంటడం వంటి తీవ్ర నీటి భద్రత సమస్యలు తలెత్తుతాయని రాక్సీ మాథ్యూ కొల్ పేర్కొన్నారు. ‘మనం ఇప్పటి నుంచే నీటి భద్రత, ముందస్తు సంరక్షణ ప్రణాళికలతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి’ అని డాక్టర్ రాక్సీ మాథ్యూ కొల్ హెచ్చరించారు.
