తుఫాన్.. ఇది మామూలు తుఫాన్ కాదు.. భయంకరమైన తుఫాన్. ఈ ఏడాది అంటే 2026లోనే భూమిపై అత్యంత భయంకరమైన తుఫాన్ గా చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని పేరు సిన్లాకు. ఇప్పుడు ఇది అమెరికాలోని నార్త్ ఈస్ట్ మరియానా దీవులను దాటింది.
సూపర్ టైకూన్ గా చెప్పబడిన ఈ సిన్లాకు తుఫాన్ తీరం దాటే సమయంలో 42 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి. అంటే అపార్ట్ మెంట్ ఎత్తులో అలలు భీకరంగా తీరం దాటాయి. అంతేనా 275 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. మరియానా దీవులను ఈ భీకర తుఫాన్ విధ్వంసం చేసింది. ఈ తుఫాన్ దెబ్బకు సైపాన్, టినియన్, రోటా, ఉత్తర మరియానా దీవుల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది.
2026లోనే.. భూమిపై.. ఏప్రిల్ నెలలో వచ్చిన అత్యంత భయంకర తుఫాన్ గా అమెరికా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుఫాన్ తీరం దాటిన దీవుల్లో కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఇళ్లు కూలిపోయాయి. వరదలు పోటెత్తాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఏకంగా 300 మిల్లీమీటర్ల వర్షం నమోదు అయ్యింది అంటే.. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం పడింది.
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా షాపులు మూసివేశారు. లోతట్టు ప్రాంతాల్లోని జనాన్ని తరలించారు అధికారులు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఆస్తి నష్టం భారీగా ఉందని అధికారులు వెల్లడించారు.
మరియానా దీవుల దగ్గర తీరం దాటిన భీకర తుఫాన్ సిన్లాకు.. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో ప్రయాణిస్తూనే ఉందని.. రాబోయే రోజుల్లో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అమెరికా వాతావరణ శాఖ అధికారులు. జనం అంతా అప్రమత్తంగా ఉండాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అలర్ట్ ఇచ్చారు అధికారులు.
ఏప్రిల్ నెలలో తుఫాన్ ఏర్పడింది అంటే.. సముద్రం నీళ్లు ఎంతగా వేడేక్కుతున్నాయో స్పష్టం అవుతుందని.. ఇది గ్లోబల్ వార్మింగ్ కు సంకేతం అంటున్నారు పర్యావరణ నిపుణులు.

