బయట సీల్‌.. బ్యాక్ డోర్ నుంచి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా

బయట సీల్‌.. బ్యాక్ డోర్ నుంచి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా
  • నాలుగు రెట్లుధర పెంచి అమ్మకాలు
  •  ఎక్సైజ్‌ ఆఫీసర్ల దాడుల్లో పట్టుబడుతున్న బాటిళ్లు

వైన్‌‌ షాపులకు వేసిన సీల్‌‌ వేసినట్లే ఉన్నా.. లోపల మందు బాటిళ్లు మాత్రం ఖాళీ అవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌‌తో లాక్‌‌డౌన్‌‌ అమల్లో ఉండడంతో సర్కారు వైన్స్‌‌లను క్లోజ్‌‌ చేసిన విషయం తెలిసిందే. అయినా వ్యాపారులు అమ్మకాలు మాత్రం ఆపలేదు. గుట్టు చప్పుడు కాకుండా బ్యాక్‌‌ డోర్‌‌‌‌ నుంచి బెల్ట్‌‌ షాపులు, రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల సీల్‌‌ కూడా తొలగిస్తున్నారు. మధ్యవర్తులను పెట్టుకొని ఒక్కో బాటిల్‌‌ను నాలుగు రెట్ల ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

రూ.1200 కోట్ల టార్గెట్‌‌

ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లాలో 164 వైన్‌‌ షాపులు, 66 బార్‌‌‌‌ అండ్‌‌ రెస్టారెంట్లు ఉన్నాయి.  22 వైన్స్‌‌లో సిట్టింగ్‌‌ పరిమిట్‌‌ కూడా ఉంది. ఎక్సైజ్‌‌ అధికారులు ఈ యేడాది (2019 అక్టోబర్‌‌‌‌ నుంచి 2020 సెప్టెంబర్‌‌‌‌ వరకు) రూ. 1200 కోట్ల అమ్మకాలు టార్గెట్‌‌గా పెట్టుకోగా.. వ్యాపారులు అందుకు తగ్గట్టుగానే స్టాక్‌‌ తెచ్చి పెట్టుకున్నారు. ఇంతలోనే కరోనా పాజిటివ్‌‌ కేసులు నమోదు కావడంతో సర్కారు లాక్‌‌డౌన్‌‌ విధించింది. దీంతో ఎక్సైజ్‌‌ అధికారులు వైన్స్‌‌లను క్లోజ్‌‌ చేసి తాళాలకు సీల్‌‌ వేశారు.

ఫుల్‌‌ డిమాండ్‌‌

కేంద్రం జనతా కర్ఫ్యూ(మార్చి 22) విధించిన మరుసటి రోజు(మార్చి23)  నుంచే లాక్‌‌డౌన్‌‌ అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రకటించారు. దీంతో సడన్‌‌గా వైన్‌‌ షాపులు, బార్లు బంద్‌‌ చేసేసరికి మందుబాబులకు షాకిచ్చినంత పనైంది. బెల్ట్‌‌ షాపుల్లో ఉన్న సరుకు కూడా రెండు మూడు రోజులకే సరిపోయింది. అదీ రెట్టింపు రేట్లకు. అనంతరం కొందరు కల్లు వైపు వెళ్లగా.. మరికొందరు మాత్రం మందు కోసం వాళ్లకు వీళ్లకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన మద్యం వ్యాపారులు గోడౌన్‌‌లో ఉంచిన మద్యాన్ని సరఫరా చేసి డబుల్, ట్రిఫుల్‌‌ రేట్లకు అమ్మారు. అక్కడా స్టాక్‌‌ అయిపోవడంతో వైన్స్‌‌ల బ్యాక్‌‌ డోర్‌‌‌‌ నుంచి, లేదా సీల్‌‌ తీసి గుట్టుచప్పుడు బెల్ట్‌‌షాపులు, సీక్రెట్‌‌ ప్లేస్‌‌లకు చేరవేయడం మొదలు పెట్టారు. వీటిని నాలుగు, ఐదు రెట్ల ధరకు అమ్ముతున్నారు. ఇటీవల అధికారులు దాడులు నిర్వహించగా పలుచోట్ల మద్యం బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డారు.

సరిహద్దుల్లో లిక్కర్‌‌‌‌ ప్యాకెట్ల దందా

మద్యం షాపుల నుంచి తరలిస్తున్న బాటిళ్లను ఎక్సైజ్‌‌ పోలీసులు పట్టుకుంటుండంతో కొందరు బెల్ట్‌‌ నిర్వాహకులు కొత్తదారిని ఎంచుకున్నారు.కర్ణాటక, ఏపీ సరిహద్దు ప్రాంతాలైన నారాయణ పేట, గద్వాల జిల్లాలో లిక్కడ్‌‌ ప్యాకెట్ల దందా మొదలు పెట్టారు. సరిహద్దులు క్లోజ్ చేసినా పక్కరాష్ట్రాలకు దొంగ దారుల్లో వెళ్లి లిక్కర్‌‌‌‌(90 ఎంఎల్‌‌) ప్యాకెట్లను తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. ఐదు రోజుల క్రితం మద్దూరు మండలం నందిపాడులో,  రెండ్రోజుల క్రితం అయిజ మండలం ఈడిగోని పల్లిలో వందల సంఖ్యలో ఒరిజినల్‌‌ చాయిస్‌‌ ప్యాకెట్ల స్వాధీనం చేసుకున్నారు.