నీట్​కౌన్సిలింగ్ పై స్టేకు నిరాకరణ ...ఎన్​టీఏ కు సుప్రీం నోటీసులు..

 నీట్​కౌన్సిలింగ్ పై స్టేకు నిరాకరణ ...ఎన్​టీఏ కు సుప్రీం నోటీసులు..

నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టు వెళ్లారు. అలాగే నీట్-యూజీ 2024 పరీక్షలను రద్దు చేయాలన్నారు. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం ( జూన్​ 11)  కేంద్రానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారి ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సమాధానం వచ్చిన తర్వాత కేసు తదుపరి విచారణను జూలై 8న చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో పారదర్శకత పాటించలేదని, దీనికి సంబంధించి సమాధానాలు కావాలని పిటిషనర్ వాదించారు.

కౌన్సెలింగ్ ప్రారంభించండి. మేము కౌన్సెలింగ్‌ను ఆపడం లేదు అని సీనియర్ న్యాయవాది మాథ్యూస్ జె నెదుంపర కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోర్టును కోరగా జస్టిస్ నాథ్ అన్నారు. ఇది అంత సులభం కాదు, ఎందుకంటే మీరు దీన్ని (పరీక్ష నిర్వహించడం) పవిత్రమైనది. దానికి సమాధానాలు కావాలి... పవిత్రత దెబ్బతింది. కాబట్టి మాకు సమాధానాలు కావాలి  అని జస్టిస్ అమానుల్లా NTA న్యాయవాదితో చెప్పారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జూన్ 4న నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అందులో 67 మంది విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. ఇందుకు సంబంధించి ఫలితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇది కాకుండా మొదటి ఏడుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే కేంద్రం నుంచి వచ్చినట్లు విద్యార్థులు చెబుతున్నారు. నీట్‌ యూజీ 2024లో అవకతవకలు జరిగాయని, ప్రశ్నపత్రం లీక్‌ కావడంపై అనేక కేసులు నమోదయ్యాయని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

నీట్ ప్రవేశపరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నందున పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఎన్ టీఏను ఆదేశించాలంటూ జూన్ 1న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శివాంగీ మిశ్రా అనే వ్యక్తితోపాటు మరికొందరు ఈ పిటిషన్ వేశారు. మరోవైపు జూన్ 4న నీట్ ఫలితాలు వెలువడ్డాక కొందరు విద్యార్థులు సైతం సుప్రీంకోర్టుకెక్కారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొందరు విద్యార్థులకు మాత్రమే గ్రేస్ మార్కులు కలపడాన్ని తప్పుబడుతూ కేసు వేశారు.

 మే 17న సైతం నీట్ ప్రవేశపరీక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎన్ టీఏకు నోటీసులు జారీ చేసింది. అయితే అప్పుడు ఫలితాల ప్రకటనపై స్టే విధించేందుకు నిరాకరించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలపై స్టే విధించడం కుదరదని తేల్చి చెప్పింది. కేసు తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.