- డీపీహెచ్ కు నర్సింగ్ ఆఫీసర్ల జేఏసీ వినతి
హైదరాబాద్, వెలుగు: సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లకు రావాల్సిన ప్రమోషన్లను ఆలస్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కోరింది. శుక్రవారం హైదరాబాద్ లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) డాక్టర్ రవీంద్ర నాయక్‌ను జాక్ లీడర్లు కలిశారు. ముందుగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి నర్సింగ్ సిబ్బంది సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రాసెస్ ను లేట్ చేయవద్దని జాక్ చైర్మన్ సుజాతా రాథోడ్ కోరారు. దీనిపై డీపీహెచ్ సానుకూలంగా స్పందించారని జాక్ నేతలు చెప్పారు. అలాగే జీఓ 190 వల్ల 317 మంది నర్సింగ్ ఆఫీసర్లపై ప్రభావం పడిందని, వారికి న్యాయం చేయాలని జాక్ లీడర్లు కోరగా.. త్వరలోనే న్యాయం చేస్తామని డీపీహెచ్ హామీ ఇచ్చారని జాక్ నేతలు వెల్లడించారు.
