హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకురావాలని, వారికి కూడా ‘010 హెడ్ ఆఫ్ అకౌంట్’ ద్వారానే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనమండలి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లు ఉండగా, వాటిలో సుమారు 3 వేల మంది ప్రిన్సిపల్స్, పీజీటీలు, టీజీటీలు పనిచేస్తున్నారని తెలిపారు.
వీరికి ప్రతినెలా జీతాలు సరైన సమయానికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీసారి వారం నుంచి పది రోజుల పాటు ఎదురుచూడాల్సి వస్తోందని, దీంతో ఆయా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సభ దృష్టికి తెచ్చారు. వారిని ఇతర రెగ్యులర్ ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగానే ట్రెజరీ పరిధిలోకి తీసుకొచ్చి, 010 పద్దు కింద వేతనాలు చెల్లించి న్యాయం చేయాలని కొమరయ్య కోరారు.
