రూ.500 నోట్లు రద్దు కాలేదు పుకార్లను నమ్మొద్దు: పీఐబీ

రూ.500 నోట్లు రద్దు కాలేదు పుకార్లను నమ్మొద్దు: పీఐబీ

న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది మార్చి నుంచి రూ.500 నోట్లు రద్దు కానున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని  కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. అవన్నీ నకిలీ వార్తలని కొట్టిపారేసింది. రూ.500 నోట్ల రద్దుపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది. రూ. 500 నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నరంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయని..ఇది పూర్తిగా అసత్య ప్రచారమని పేర్కొంటూ పీఐబీ ఫ్యాక్ట్‌‌చెక్‌‌ విభాగం శుక్రవారం ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది.

 రూ.500 కరెన్సీ నోటు చట్టబద్ధంగా చెల్లుతుందని, నగదు లావాదేవీల కోసం ప్రజలు దీనిని ఉపయోగించవచ్చని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పుకార్లను నమ్మి గందరగోళానికి గురి కావొద్దని సూచించింది. అధికారిక వర్గాల ద్వారా సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని కోరింది. పీఐబీ క్లారిటీతో రూ.500 నోట్ల రద్దు ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. కాగా.. 2025 జూన్ నెలలో కూడా కేంద్ర ప్రభుత్వం రూ.500 కరెన్సీ నోటును ఉపసంహరించుకుంటుందని ప్రచారం జరిగింది.