ఆడుకోమని పిల్లలకు ఫోన్ ఇచ్చి హుస్సేన్ సాగర్లో దూకేసిన తల్లి

ఆడుకోమని పిల్లలకు ఫోన్ ఇచ్చి హుస్సేన్ సాగర్లో దూకేసిన తల్లి

హైదరాబాద్: హైదరాబాద్‌లో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన చెందిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ట్యాంక్‌బండ్‌పై కూర్చోబెట్టి, హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. పహాడీ షరీఫ్లో నివాసముంటున్న వసంత(29)కి ఇద్దరు కుమారులు. ఏడేళ్ల నందు, మూడున్నర ఏళ్ల చెర్రీ ఉన్నారు. నాలుగేళ్ల కిందట భర్త లక్ష్మణ్‌ కామెర్ల వ్యాధితో చనిపోయాడు.

అప్పటి నుంచి పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. కూలీ పనులతో జీవనం సాగిస్తున్న వసంత శుక్రవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్‌కు వచ్చి అక్కడ కుర్చీలో వారిని కూర్చోబెట్టింది. సెల్‌ఫోన్‌ ఇచ్చి ఆడుకోమని చెప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూకేసింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని తెలియజేశారు. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు మార్చురీకి తరలించారు. పిల్లలను ఆమె సోదరుడికి అప్పగించారు.