- సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి
హుస్నాబాద్, వెలుగు: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్లో శుక్రవారం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల అభివృద్ధి పనులపై ఆర్డీవో రామ్మూర్తి, డీఆర్డీవో జయదేవ్ ఆర్యలతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శాఖల వారీగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్జీఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన సీసీ, బీటీ రోడ్లు, హెల్త్ సబ్ సెంటర్లు, అంగన్వాడీ టాయిలెట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతులు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పీహెచ్సీల మేజర్, మైనర్ రిపేర్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గౌరవెల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో మిషన్ భగీరథ పనులను గడువులోగా పూర్తి చేయాలని, ఉద్యానవన శాఖ అధికారులు ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు.
కామన్ డైట్ మెయింటెన్ చేయాలి
సిద్దిపేట (దుబ్బాక) : ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ కె.హైమావతి సూచించారు. శుక్రవారం దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ స్కూల్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. కామన్ డైట్ మెనూ ఎందుకు మెయింటెనెన్స్ చేయడం లేదని, విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఆహార పదార్థాలను వండడం లేదని, రికార్డుల్లో అవకతవకలు ఉన్నాయని ప్రిన్సిపల్ బుచ్చిబాబును, మధ్యాహ్న భోజన కాంట్రాక్టర్ ను నిలదీశారు.
డీఈవో, ఎంఈవోలు స్కూళ్లను విజిట్ చేసి తనిఖీలు చేస్తున్నారా..? లేదా..? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిధిలోని రామక్కపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అటెండెన్స్, పలు రిజిస్టర్ లను తనిఖీ చేశారు.
