ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు అండగా ఉంటా : ఎమ్మెల్యే హరీశ్ రావు

ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు అండగా ఉంటా : ఎమ్మెల్యే హరీశ్ రావు
  • మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ఎల్లప్పుడు అండగా ఉంటానని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.  శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ క్యాలెండర్‌‌ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు చెందిన టీచర్లు, మేనేజ్‌మెంట్లు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. 

అనంతరం అసోసియేషన్ సభ్యులు హరీశ్ రావు కు పుష్పగుచ్ఛం అందజేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీపీఎస్‌ఏ అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, ప్రతినిధులు రమేశ్‌, సంపత్ కుమార్, మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.

ఇర్కోడ్ లిఫ్ట్ పనులు పూర్తి చేయండి ఇరిగేషన్‌ శాఖ మంత్రికి హరీశ్‌రావు లెటర్‌‌

సిద్దిపేట రూరల్, వెలుగు: ఇర్కోడ్ లిఫ్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలని, ఈ లిఫ్ట్ పూర్తయితే 17వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డికి లెటర్ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌‌ ద్వారా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో 17,377 ఎకరాల భూమికి సాగునీరు అందుతోందన్నారు. 

2023 వరకు 95శాతం పనులు పూర్తి చేశామని, మరో 5శాతం పంపు హౌస్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. ఈ లిఫ్ట్​ను పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించాలని విజ్ఞప్తి చేశారు.