మెల్ బోర్న్: భారత్‌తో జరుగుతోన్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా మహిళల జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం (ఫిబ్రవరి 27) హోబర్ట్ వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మక రెండో వన్డేలో భారత్‌పై ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. జార్జియో వోల్ (101) సూపర్ సెంచరీకి తోడు ఫోబ్ లిచ్ ఫీల్డ్ (80) హాఫ్ సెంచరీతో రాణించడంతో కంగారులు విజయం సాధించారు.
తద్వారా సొంత గడ్డపై టీ20 సిరీస్ ఓటమికి ఆసీస్ అమ్మాయిలు ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా అమ్మాయిలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 రన్స్ చేశారు. ఓపెనర్ ప్రతీకా రావల్ (52), కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ (54) అర్ధ సెంచరీలతో రాణించారు. స్టార్ బ్యాటర్ స్మృతి మందాన (31) ఫర్వాలేదనిపించింది. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది.
ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్, సదర్లాండ్, యాష్లే గార్డనర్ తలో రెండు వికెట్లు తీశారు. మెగన్ స్కాట్, నికోలా కారీ చెరో వికెట్ సాధించారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ అమ్మాయిలు కేవలం 36.1 ఓవర్లలోనే ఛేధించారు. జార్జియో వోల్ (101) సూపర్ సెంచరీకి తోడు ఫోబ్ లిచ్ ఫీల్డ్ (80) హాఫ్ సెంచరీతో రాణించి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు.
భారత బౌలర్లలో దీప్తి శర్మ, కేశవి గౌతమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్ ఒక వికెట్ సాధించింది. అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జార్జియా వోల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెల్చుకుంది. సిరీస్ చివరి మూడో నామామాత్రపు వన్డే 2026, మార్చి 1వ తేదీన హోబర్ట్ వేదికగా జరగనుంది.
