న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మే 20కి వాయిదా వేసింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని 2021, జులై 22న రేవంత్ రెడ్డి, తన పేరును తొలగించాలని కోరుతూ అదే ఏడాది ఏప్రిల్ 13న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా, ప్రతివాదుల తరఫున సీనియర్ అడ్వకేట్ ఆర్యమ సుందరం, జగదీశ్వర్ రెడ్డి తరఫున అడ్వకేట్ వికాస్ సింగ్ హాజరయ్యారు. తొలుత ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్ 12, సహా పలు సెక్షన్ల మహేంద్ర కుమార్, రాంచంద్రజన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అదర్స్ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్ర, జస్టిస్ కే వీ విశ్వనాథన్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిందన్నారు. ఆ తీర్పులోని అంశాలు ఓటుకు నోటు కేసుతో ముడిపడి ఉన్నాయని, ఈ తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామని గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు.
ఆ తీర్పు వచ్చే వరకు పిటిషన్లపై విచారణ వాయిదా వేశారన్నారు. మరో రెండు వారాల్లో ఆ తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రస్తుత విచారణను వాయిదా వేయాలని కోరారు. మరో వైపు జగదీశ్‌రెడ్డి తరఫున వికాస్ సింగ్ జోక్యం చేసుకొని.. ఇంప్లీడ్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకొని పిటిషనర్లకు నోటీసు ఇవ్వాలని కోరారు. అయితే.. ఈ వాదనలపై సిద్ధార్థ్ లూథ్రా అభ్యంతరం తెలిపారు. దీంతో బెంచ్ కేసు విచారణను మే 20 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. అలాగే జగదీశ్వర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది.

