- తాత్కాలికంగా అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఓపెన్, డిస్టెన్స్ డిగ్రీ చేసినోళ్లూ అడ్వొకేట్ గా ఎన్ రోల్ చేసుకోవచ్చని, అయితే ఎల్ఎల్ బీ మాత్రం రెగ్యులర్ గా చేసి ఉండాలని సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ఇలా న్యాయవాద కోర్సును పూర్తిచేసిన వారిని తాత్కాలికంగా ఎన్‌రోల్ చేయాలని తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) రూపొందించిన రూల్స్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్–2008లోని రూల్ 5 అమలుకు సంబంధించిన వివాదంపై తుది విచారణ పెండింగ్‌లో ఉండగా ఈ ఆదేశాలు ఇచ్చింది. పలువురు అభ్యర్థులు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలు పొంది, అనంతరం బీసీఐ గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో రెగ్యులర్‌గా మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.
అయితే, బ్యాచిలర్ డిగ్రీలను ఓపెన్ లేదా డిస్టెన్స్ విధానంలో చదివారనే కారణంతో వారి ఎన్‌రోల్‌మెంట్ కు బార్ కౌన్సిల్ నిరాకరించింది. మరో అభ్యర్థి 2006లో మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ విధానంలో బీకాం పూర్తి చేసి, 2020లో ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో రెగ్యులర్‌గా ఎల్‌ఎల్‌బీ చేశారు. ఆయన ఎన్‌రోల్‌మెంట్‌ను తెలంగాణ బార్ కౌన్సిల్ తిరస్కరించగా, 2024లో హైకోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థించింది.
దీంతో సదరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా.. అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నంతకాలం ఎన్‌రోల్‌మెంట్‌ను నిరాకరించడం అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది. విద్యార్హత పత్రాల పరిశీలన, ఇతర రూల్స్‌కు లోబడి వారికి తాత్కాలిక ఎన్‌రోల్‌మెంట్ కల్పించాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. బాధిత అభ్యర్థుల శాశ్వత ఎన్‌రోల్‌మెంట్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
