- ఆదేశాల అమలుపై ప్రతి మూడు నెలలకొకసారి పర్యవేక్షణ
- ఆగస్టు 15లోగా రిపోర్టులు ఇవ్వాలని రాష్ట్రాలకు డెడ్‌లైన్
న్యూఢిల్లీ: పాఠశాలల్లో శానిటరీ న్యాప్‌కిన్లు, నీటి సదుపాయం ఉన్న ప్రత్యేక మరుగుదొడ్లు అందుబాటులో లేవనే కారణంతో బాలికలు తమ చదువును మధ్యలోనే ఆపేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు, ప్రత్యేక మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని ఈ ఏడాది జనవరి 30న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఈ తీర్పు రాష్ట్రాల్లో ఎంతవరకు అమలవుతుందో సమీక్షించడానికి సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం కేవలం గత రెండు, రెండున్నర నెలల డేటాను మాత్రమే సేకరించామని చెప్పడంతో, కోర్టు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం కేంద్రానికి పలు సూచనలు చేసింది. ‘‘ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ తీర్పు బాలికల శ్రేయస్సు కోసమే. కేవలం ఈ సౌకర్యాలు లేవనే కారణంతో బాలికలు చదువు మానేసి, ఇండ్లకే పరిమితమై గృహ పనుల్లో మునిగిపోకూడదు. మా తీర్పు ద్వారా లభించే ప్రయోజనాలు వీలైనంత వరకు అందరికీ అందేలా చూడటం మీ బాధ్యత. రాష్ట్రాల నుంచి క్రమం తప్పకుండా అవసరమైన డేటాను సేకరిస్తూ, వారికి తగిన గైడెన్స్ అందించడి’’ అని పేర్కొంది.
నోడల్ డిపార్ట్‌మెంట్‌గా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ
ఈ ఆదేశాల అమలును తాము ప్రతి మూడు నెలలకొకసారి స్వయంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడునెలలకొకసారి దీనిపై రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో తదుపరి నివేదికల సమర్పణకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను నోడల్ డిపార్ట్‌మెంట్‌గా కోర్టు ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ తాజా రిపోర్టులను ఆగస్టు15 లోగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నివేదికల సమర్పణలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 1 కి వాయిదా వేసింది.
మెన్‌స్ట్రువల్ హెల్త్ జీవించే హక్కులో భాగం
రాజ్యాంగంలోని ఆర్టికల్–21 ప్రకారం ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. బాలికలకు మెన్‌స్ట్రువల్ హెల్త్, పరిశుభ్రత కల్పించడం కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేసింది. ఈ వసతులు లేకపోవడం వల్ల బాలికలు చదువులో వెనుకబడిపోతున్నారని, భవిష్యత్తులో వారు అన్ని రంగాలలో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
