- పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాలను కాల్చకుండా అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించి ఎంసీ మెహతా కేసులో బుధవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల బెంచ్ మరోసారి విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఒక పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదనలు కొనసాగిస్తూ.. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 450 దాటిందని బెంచ్‌కు నివేదించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంతో పాటు పలు ప్రాంతాల్లో ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మెనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) 3వ దశ అమలు చేస్తున్నప్పటికీ.. నాలుగో దశను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మధ్యలో సీజేఐ జోక్యం చేసుకొని.. పంట వ్యర్థాల దహనం అరికట్టేందుకు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్ దాఖలు చేయాలన్నారు.
మరోవైపు, ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో తప్పుడు డేటాను అప్‌డేట్ చేస్తున్నారని అడ్వకేట్ ఎత్తిచూపారు. దీనిపై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుంటూ.. తాము స్టేటస్ రిపోర్ట్ సమర్పించామని, అధికారులు కూడా అందుబాటులో ఉన్నారని, వారు అన్ని అంశాలను వివరిస్తారన్నారు. ఈ అంశంపై గురువారం విచారణ చేపట్టాలని కోరారు.
మరోవైపు, అమికస్ క్యూరీ సీనియర్ అడ్వొకేట్ స్పందిస్తూ.. ‘వాయు కాలుష్యం ప్రమాద స్థితికి చేరుకుంటోంది. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలి. కాలుష్యం పర్యావరణ సమస్యపై ఏమి జరుగుతుందో అధికారులు వివరిస్తే, దీనిపై గురువారం విచారణ చేపట్టవచ్చు’ అని అన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 17న చేపడతామని తెలిపింది.
