కోర్టు కేసులపై కామెంట్లు చేస్తున్నరు : సుప్రీంకోర్టు

కోర్టు కేసులపై కామెంట్లు చేస్తున్నరు : సుప్రీంకోర్టు
  • సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నరు
  • అస్సాం ఎమ్మెల్యేకు కోర్టు ధిక్కరణ నోటీసులు
  • కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు  

న్యూఢిల్లీ: సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి మెసేజ్ లు, కామెంట్లు చేస్తున్నారని, ఆర్టికల్స్ రాసి పోస్టు చేస్తున్నారని.. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. తనపై దాఖలైన ఎలక్షన్ పిటిషన్ పై తనకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందని అస్సాం ఎమ్మెల్యే కరీముద్దీన్ బర్బుయా ఇటీవల ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. 

అయితే తీర్పు ఇవ్వకముందే ఆయన ఇలా సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎమ్మెల్యేకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా దుర్వినియోగంపై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టి బేలా త్రివేదిలతో కూడిన డివిజన్ బెంచ్ కీలక కామెంట్లు చేసింది. ‘‘ప్రస్తుతం సోషల్ మీడియాను విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారు.

 కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి మెసేజ్ లు, కామెంట్లు చేస్తున్నారు. ఆర్టికల్స్ కూడా పోస్టు చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో కోర్టు కేసులపై కామెంట్లు చేయడం మంచికాదు. అది న్యాయస్థానాల అధికారాన్ని, గౌరవాన్ని తగ్గించడం, న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఇది చాలా తీవ్రమైన అంశం” అని బెంచ్ పేర్కొంది. 

వాదనల సందర్భంగా జడ్జీలు వాద ప్రతివాదులకు అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందించడం సహజం. అలా అని కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో కామెంట్లు చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు కాదు. వాస్తవాలను వక్రీకరించడం, విచారణ జరిగిన తీరును పూర్తిగా తెలియజేయకపోవడం కరెక్టు కాదు. ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని తెలిపింది. ఎమ్మెల్యే కరీముద్దీన్ కు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ.. కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.  

ఇదీ కేసు..  

అస్సాంలోని ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) పార్టీకి చెందిన కరీముద్దీన్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సోనాయ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే ఆయన తన విద్యార్హతలను నామినేషన్ పేపర్లలో తప్పుగా పేర్కొన్నారని కాంగ్రెస్ లీడర్ అమీనుల్ హక్ లస్కర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను కొట్టేయాలని గౌహతి హైకోర్టును కరీముద్దీన్ ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది.

 దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మార్చి 20న తీర్పు రిజర్వ్ చేసింది. కానీ తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందంటూ కరీముద్దీన్ అదే రోజు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. దీంతో కోర్టు ఆయనకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కాగా, కరీముద్దీన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఆయనపై దాఖలైన ఎలక్షన్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఈ నెల 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.