హైదర్​నగర్.. భూ వివాదంపై సుప్రీం తీర్పు

హైదర్​నగర్.. భూ వివాదంపై సుప్రీం తీర్పు
  •     తెలంగాణ సర్కార్, ట్రినిటీ, 
  •     ఇతరుల పిటిషన్లు కొట్టివేత

న్యూఢిల్లీ, వెలుగు: దాదాపు 70 ఏండ్లుగా కొనసాగుతున్న హైదర్​నగర్​లోని వేలకోట్ల రూపాయల విలుపై భూములకు సంబంధించి వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. నిజాం కాలంలో సాగుచేసినట్లుగా పట్టాలున్న వారి నుంచి కొనుగోలు చేసిన వారికి మాత్రమే భూములపై హక్కులుంటాయని గతంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. గురువారం ఈ మేరకు జస్టిస్ వి.రామసుబ్రమణియం, జస్టిస్ పంకజ్ మిత్తల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 132 పేజీలతో కూడిన సుదీర్ఘ తీర్పును వెలువరించింది. హైదర్​నగర్​లోని 196.20 ఎకరాల భూములు తమకు చెందుతాయని తెలంగాణ సర్కార్, ట్రినిటీ సంస్థ, కొంతమంది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ కాలంగా విచారణ సాగుతున్నది. దీనిపై.. తీర్పును తొమ్మిది భాగాలుగా విభజిస్తూ ఎందుకు పిటిషన్లను కొట్టివేస్తున్నామో వివరించింది. వాస్తవానికి మొత్తం 196.20 ఎకరాలు ఉండగా.. ఇందులో కేవలం 11 ఎకరాలకు సంబంధించిన భూ వివాదాన్ని మాత్రమే విచారణకు తీసుకొని ఆయా భూములకు సంబంధించి హక్కుదారులు వాటిని స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొంది. మిగిలిన 185.20 ఎకరాల్లోని భూములకు హక్కుదారులు తేల్చేందుకు భూచట్టాల రూల్స్ ను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణ సర్కార్, ట్రినిటీ, మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్లు డిస్మిస్ చేసింది.

రాష్ట్ర సర్కార్​కు ఎలాంటి బైండింగ్​ లేదు

ధర్మాసనం తీర్పులో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 1955 చట్టాన్ని పరిగణనలోకి తీసుకొనే పరిస్థితి, సందర్భం కోర్టుకు లేదని అభిప్రాయపడింది. కేవలం 11 ఎకరాలు మాత్రమే దావా వేసిన పిటిషనర్లు కలిగి ఉన్నారని భావిస్తున్నప్పుడు..  మిగిలిన భూమిపై ఎవరికి హక్కు ఉంటుందనే విషయాన్ని ప్రశ్న గానే మిగిల్చింది. ఈ విషయంలో.. జాగీర్ నిర్మూలన రూల్స్ ప్రకారం అప్పీలు దారులకు మిగిలిన భూములపై హక్కులు లేకుంటే, 1948కి ముందు మంజూరైన పట్టాల కారణంగా క్లెయిమ్ పిటిషనర్లు భూమిలో ఒక భాగానికి మాత్రమే పట్టా కలిగి ఉన్నట్లు తెలుస్తుందని పేర్కొంది.