V6 News

ఆ 424 ఎకరాలు రిజర్వ్ ఫారెస్టే.. ప్రభుత్వ అప్లికేషన్ను అంగీకరించిన సుప్రీంకోర్టు

ఆ 424  ఎకరాలు రిజర్వ్ ఫారెస్టే.. ప్రభుత్వ అప్లికేషన్ను అంగీకరించిన సుప్రీంకోర్టు

రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌‌లో ఉన్న 424.31 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్​గా నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. ఈ విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్లికేషన్ను అంగీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌లో ఉన్న మొత్తం 424.31 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్ గా నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం స్వాగతించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్లికేషన్​ను అంగీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్ లోని 102 ఎకరాల భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ - మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని గతేడాది డిసెంబర్ 19న సుప్రీంకోర్టు ధర్మాసనం మొత్తం 47 పేజీల తీర్పును వెలువరించింది.

ఈ భూమి వ్యవహారంలో సాలార్‌జంగ్ వారసులు చేస్తున్న వాదననూ తోసిపుచ్చింది. గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు  నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ 102 ఎకరాల భూమిని ‘రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను రెండు నెలల్లోగా(8 వారాల్లో) పూర్తి చేయాలని సీఎస్ ను ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని తీర్పులో స్పష్టం చేసింది. మరోసారి ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ ఎస్ వీ ఎన్ భట్టి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు స్పందిస్తూ  వివాదస్పదమైన 102 ఎకరాలతోపాటు మొత్తం ఆ బ్లాక్ లోని 423.31 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్ గా రాష్ట్రం ప్రభుత్వం గుర్తించినట్టు బెంచ్​కు నివేదించారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ను పరిశీలించిన జస్టిస్ ఎస్ వీ ఎన్ భట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్టు పేర్కొంటూ.. అన్ని పిటిషన్లపై విచారణను ముగించారు. 

అసలు ఏం జరిగింది..
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీ ఖాన్ (సాలార్‌జంగ్-3 వారసులు) తదితరులు ఈ భూములు తమవే అని క్లైయిమ్ చేసుకుంటు వస్తున్నారు. దీనిపై తెలంగాణ సర్కార్ ఏప్రిల్ 20, 2023 లో సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ కు వెళ్లింది. 

కాగా..  గత రెండున్నరేండ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే, 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి.  కాగా.. అన్ని వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. జాగీర్ల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కారు పరమయ్యాయని డిసెంబర్ 2025 తీర్పులోనే స్పష్టం చేసింది. రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించాలని సీఎస్ ను ఆదేశించింది.