ఇట్ల పంచుకుంట పోతే పైసా మిగలదు.. ప్రభుత్వ ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్‌‌‌‌‌‌‌‌

ఇట్ల పంచుకుంట పోతే పైసా మిగలదు.. ప్రభుత్వ ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్‌‌‌‌‌‌‌‌
  • అన్ని ఫ్రీగా ఇస్తే అభివృద్ధికి నిధులెట్ల తెస్తరని ప్రశ్న
  • వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు సర్కారుకు ఆదేశం

న్యూఢిల్లీ: ఉచిత పథకాలు అమలు చేసుకుంటూ పోతే అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీం కోర్టు కామెంట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్య పెట్టడం, ఉచిత పథకాలను ప్రకటించడాన్ని తప్పుపట్టింది. ఇలాంటి పద్ధతే సరైందికాదంటూ తీవ్రంగా స్పందించింది. ఉచితంగా ఆహారం, ఫ్రీగా కరెంటు సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేయడం కొనసాగిస్తే వాస్తవ అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తి వివరణ ఇవ్వాలని తమిళనాడు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. 

లోటు బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న తమిళనాడు సర్కారు.. వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై సుప్రీం కోర్టు చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ సూర్యకాంత్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని బెంచ్‌‌‌‌‌‌‌‌ గురువారం విచారణ జరిపింది.

ఉచిత విద్య, వైద్యం, సంక్షేమ చర్యలు అందజేయడంవరకు బాగానే ఉంటుంది కానీ, కరెంటు బిల్లు చెల్లించగలిగే స్తోమత ఉన్నవాళ్లకు కూడా ఫ్రీగా కరెంటు సప్లయ్‌ చేయడమేంటని చీఫ్‌ జస్టిస్‌ ప్రశ్నించారు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు రానుండగా ఈ పథకాన్ని ఇప్పటికిప్పుడు ఎందుకు ప్రకటించారో చెప్పాలని డీఎంకే సర్కారును నిలదీశారు. ‘‘ఉచిత ఆహారం నుంచి మొదలు.. ఉచిత కరెంటు ఆపై నేరుగా ప్రజల ఖాతాల్లోకి నగదు ఇచ్చేదాకా చేరుకున్నం. దేశంలో మనం ఎలాంటి కల్చర్‌‌ను డెవలప్‌ చేస్తున్నం?”అని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇష్టారీతిన ఉచితాలు పంపిణీ చేస్తూ.. పనిచేయకుండానే ప్రతిఫలం లభించే సంస్కృతిని సృష్టిస్తున్నామని కామెంట్‌ చేశారు. ఆదాయంలో కనీసం పావు వంతైనా అభివృద్ధి పనులకోసం ప్రతి రాష్ట్రం ఖర్చు చేయాలని సూచించారు. ‘‘మౌలిక సదుపాయాలు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీల అభివృద్ధికి బదులుగా ఎన్నికల సమయంలో మీరు వస్తువులు పంపిణీ చేస్తరు. రాష్ట్ర ప్రభుత్వాల ఇలాంటి విధానాల కారణంగా అభివృద్ధి కోసం ఒక్క పైసా మిగలదు’’ అని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య ఒక్క తమిళనాడుదే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని అన్నారు. దీనిపై రాష్ట్రాల ప్రభుత్వాల సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.