టీజీపీఎస్సీకి సుప్రీం కోర్టు నోటీసులు

టీజీపీఎస్సీకి సుప్రీం కోర్టు నోటీసులు
  •     2015 ఏఎంవీఐ రిక్రూట్​మెంట్​లో అన్యాయం జరిగిందని పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు: పదేండ్ల కిందటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్(ఏఎంవీఐ) రిక్రూట్​మెంట్ వ్యవహారంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. టీజీపీఎస్సీ 2015లో ఏఎంవీఐ రిక్రూట్​మెంట్ నిర్వహించింది. దీనికి సంబంధించి మెడికల్ టెస్ట్ లు సరిగా నిర్వహించకపోవడం వల్ల తనకు అన్యాయం జరిగిందని అభ్యర్థి రవికుమార్ గత నెల 22న సుప్రీంకోర్టులో పిటిషన్​వేశాడు. 

దీనిపై బుధవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్ వీ.అంజారియా ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. మెడికల్ ఎగ్జామినేషన్ సరిగా నిర్వహించకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయారన్నారు. 

మెడికల్ టెస్ట్​కు మూడు రోజుల ముందు రవికుమార్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. అప్పుడు అతని చాతి 7 సెంటీమీటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. అయితే, టీజీపీఎస్సీ మెడికల్​టెస్ట్​లను సమర్థంగా నిర్వహించని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించలేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని కోర్టు ముందుంచి, రవికుమార్​కు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం టీజీపీఎస్సీతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.