రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు పరిధి దాటి వ్యవహరిస్తున్నరు : జస్టిస్ లావు నాగేశ్వరావు

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు పరిధి దాటి వ్యవహరిస్తున్నరు : జస్టిస్ లావు నాగేశ్వరావు
  • ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం 
  • సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు

ముషీరాబాద్, వెలుగు : దేశంలో రాజ్యాంగ పదవుల్లోని వారంతా పరిధి దాటి వ్యవహరిస్తున్నారని.. ఇది మంచి సంప్రదాయం కాదని రాజ్యాంగానికి లోబడి ఎవరి పరిధిలో వారు పనిచేస్తే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరావు అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా లయన్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన’ అంశంపై జాతీయ సెమినార్ కొల్లి సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.

రాజ్యాంగం ప్రజల పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ముందుగా నాగేశ్వరరావు ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే హక్కు పార్లమెంటుకు లేదని, రాజ్యాంగం అనేది ఒక మూల సూత్రమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యాయవాదులు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులపై అవగాహన పెంచుకోవాలని, ప్రాథమిక హక్కులు నిర్దేశిక సూత్రాలు రెండు సమతుల్యంగా ఉన్నప్పుడే రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే అవకాశం బలంగా ఉంటుందన్నారు.

ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ గత 70 ఏళ్లలో లౌకిక వ్యవస్థ గురించి రాజ్యాంగం న్యాయ వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై వివరించి మాట్లాడారు.  కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి, విద్యాసాగర్, ఎంవీ దుర్గాప్రసాద్, సీహెచ్ శైలజ, వెంకటేశ్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.