జైళ్లలో రద్దీ, వసతుల వివరాలు సమర్పించండి : సుప్రీం కోర్టు

జైళ్లలో రద్దీ, వసతుల వివరాలు సమర్పించండి : సుప్రీం కోర్టు
  •     రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో ఉన్న పరిస్థితులు, ఖైదీల రద్దీని అదుపుచేసేందుకు తీసుకుంటున్న చర్యల వివరాలను మే 18లోగా సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జైలులో ఎంతమంది ఖైదీలు ఉండాలి? ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? సామర్థ్యానికి మించి ఉన్న ఖైదీల రద్దీని తగ్గించేందుకు ప్రతిపాదించిన ప్రణాళికల వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. 

రాష్ట్రాల పరిధిలోని మహిళా జైళ్ల సంఖ్య, అక్కడున్న వసతులు, మహిళా ఖైదీలతో పాటు జైలులో ఉంటున్న పిల్లల విద్య, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యల వివరాలు తెలియజేయాలని పేర్కొంది. జైళ్లలో మంజూరైన సిబ్బంది సంఖ్య, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు, వాటిని భర్తీ చేసేందుకు తీసుకుంటున్న చర్యలను నివేదించాలంది. రాష్ట్ర హోం సెక్రటరీ స్వయంగా అఫిడవిట్ దాఖలు చేస్తూ ఈ వివరాలను మే 18లోగా అందించాలని స్పష్టం చేసింది.