- శబరిమల అంశంలో లాయర్ల అసోసియేన్ పై సుప్రీం ఆగ్రహం
- కేవలం వార్తా కథనాల ఆధారంగా పిటిషన్ లు ఏంటని నిలదీత
న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్) దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మండిపడింది. ప్రస్తుతం పిల్‌లు 'ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పైసా ఇంట్రెస్ట్ లిటిగేషన్, పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్'గా మారిపోయాయని అసహనం వ్యక్తం చేసింది. కేరళలోని శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్ష, మత స్వేచ్ఛ పరిధిపై దాఖలైన పిటిషన్లను మంగళవారం రాజ్యాంగ ధర్మాసనం విచారించింది.
సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ఈ బెంచ్‌లో జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ అహ్రానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలే, జస్టిస్ ఆర్. మహదేవన్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ సభ్యులుగా ఉన్నారు. విచారణ సందర్భంగా బెంచ్ స్పందిస్తూ..2006లో 'ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్' శబరిమలలో 10 నుంచి 50 ఏండ్ల మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సవాల్ చేస్తూ వేసిన పిల్‌ను ప్రశ్నించింది.
కేవలం జూన్ 2006లో వచ్చిన 4 వార్తా కథనాల ఆధారంగా ఈ పిటిషన్ వేశామని అడ్వకేట్ రవి ప్రకాశ్ గుప్తా తెలపడంపై అసహనం వ్యక్తం చేసింది. "వార్తా కథనాలు పిటిషన్ వేయడానికి ఆధారం ఎలా అవుతాయి? పిల్‌లు వేయడం కోసమే కథనాలు రాయించుకోవడం సులభమైపోయింది. ఈ పిటిషన్‌ను అప్పుడే కొట్టివేసి ఉండాల్సింది" అని సీజేఐ వ్యాఖ్యానించారు.
జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. " నిజంగా అవసరమున్న ప్రజల కోసం మేం హైకోర్టులు, సుప్రీంకోర్టులలో పిల్‌లను విచారిస్తున్నాం. కేవలం పత్రికా కథనాల కోసం కాదు. ఇప్పుడు పిల్ అంటే ప్రైవేట్, పబ్లిసిటీ, పైసా, పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌గా మారింది. మేం కేవలం నిజమైన, చిత్తశుద్ధి ఉన్న వ్యాజ్యాలను మాత్రమే అనుమతిస్తాం" అని స్పష్టం చేశారు.
