
- స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: మణిపూర్లో రెండు జాతుల మధ్య తలెత్తిన హింస నేపథ్యంలో శాంతిభద్రతలు మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితుల పునరావాసం కోసం ఏం చేశారో చెప్పాలని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నదని, కర్ఫ్యూని ఇప్పుడు 24 గంటల నుంచి 5 గంటలకు తగ్గించామని మణిపూర్ ప్రభుత్వం తెలిపింది.
అయితే, కొన్ని మిలిటెంట్ గ్రూపులను రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేసిందని కుకీ తెగ తరపున వాదించిన అడ్వొకేట్ కొలిన్ గాన్ సాల్వేస్ ఆరోపించారు. ఈ ఆరోపణలను మణిపూర్ ప్రభుత్వ అడ్వొకేట్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు. ప్రభుత్వంపై అలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతం మణిపూర్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించారని వెల్లడించారు. వాదనలు విన్న బెంచ్.. విచారణను
ఈ నెల 10కి వాయిదా వేసింది.