ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడిగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న అభిషేక్ బోయినపల్లి బెయిల్‌‌‌‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 4 తర్వాత వాదనలు వింటామని చెప్పింది. లిక్కర్ స్కాం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు.

వీటిపై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌‌‌‌వీఎన్‌‌‌‌ భట్టిల బెంచ్‌‌‌‌ విచారణ జరిపింది. బెయిల్ పిటిషన్‌‌‌‌పై ఆగస్టులో కోర్టు ఆదేశాల ప్రకారం.. అభిషేక్ పిటిషన్‌‌‌‌ను వ్యతిరేకిస్తూ ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫు అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా అభిషేక్‌‌‌‌ను అరెస్ట్ చేశారన్నారు. సీబీఐ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఈడీ కేసులో ఆయనను అరెస్ట్ చేశారని, అభిషేక్‌‌‌‌కు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ వాదనపై ఈడీ తరఫు అడ్వకేట్ అభ్యంతరం చెప్పారు.

రూ.3.85 కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీ నుంచి అభిషేక్ అకౌంట్‌‌‌‌కు నేరుగా బదిలీ అయినట్లు గుర్తించామని తెలిపారు. మధ్యలో జస్టిస్ సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని..పీఎంఎల్ఏ సెక్షన్ 19 పరిగణలోకి తీసుకోకుండా అభిషేక్‌‌‌‌ అరెస్ట్ జరిగిందన్న పిటిషన్‌‌‌‌పై 5 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించారు.