V6 News

మమతా బెనర్జీ చర్యలతో ప్రజాస్వామ్యానికి ముప్పు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

మమతా బెనర్జీ చర్యలతో ప్రజాస్వామ్యానికి ముప్పు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
  • ఐ-ప్యాక్ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
  • ఈడీ విచారణ సమయంలో సీఎం జోక్యం సరికాదని వ్యాఖ్య

న్యూఢిల్లీ: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్న సమయంలో సీఎం స్వయంగా జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని వ్యాఖ్యానించింది. బెంగాల్‌‌‌‌లో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణానికి సంబంధించి నమోదైన మనీలాండరింగ్‌‌‌‌ కేసుపై ఈడీ గత కొన్నేండ్లుగా దర్యాప్తు చేస్తున్నది. 

అయితే, రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ ఆఫీసులో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో సీఎం మమతా బెనర్జీతోపాటు అధికారులు అక్కడికి వెళ్లారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.  దీనిపై బుధవారం విచారణ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన బెంచ్​ ఘాటుగా స్పందించింది.  సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించే పరిస్థితి తలెత్తుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ కూడా ఊహించి ఉండరని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఎన్నికలకు సరిగ్గా ఒక్కరోజు ముందు కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సీఎం జోక్యం సరికాదు..

జనవరిలో జరిగిన మనీలాండరింగ్ సోదాల సమయంలో మమతా బెనర్జీ, రాష్ట్ర అధికారులు ఐ-ప్యాక్ కార్యాలయానికి, దాని వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్లారని ఈడీ కోర్టులో వాదించింది. సోదాలు జరుగుతుండగానే ముఖ్యమంత్రి అక్కడి నుంచి ఒక ల్యాప్ టాప్, ఫోన్, పలు కీలక పత్రాలను తీసుకొని వెళ్లారని పేర్కొన్నది. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఒక రాష్ట్ర సీఎం  దర్యాప్తు మధ్యలోకి వెళ్లి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టడం సరికాదని పేర్కొన్నది.‘‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దర్యాప్తు జరుగుతున్న చోటికి స్వయంగా వెళ్లి అడ్డుకోవడం అనేది వ్యక్తిగత చర్య. దీన్ని కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉన్న వివాదంగా చూడలేం” అని పేర్కొన్నది.

బెంగాల్ పరిస్థితులపై ఆందోళన..

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా సవరణ సమయంలో రాష్ట్రంలో ఏడుగురు న్యాయాధికారులను బందీలుగా ఉంచిన ఘటనను కోర్టు గుర్తు చేసింది. ‘‘అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులపై మేం కళ్లు మూసుకోలేం. ఇది సామాన్య వ్యక్తుల మధ్య గొడవ కాదు.. అత్యంత అసాధారణమైన పరిస్థితి” అని వ్యాఖ్యానించింది.