పోక్సో కేసులో శిక్ష రద్దు చేసిన సుప్రీంకోర్టు

పోక్సో కేసులో శిక్ష రద్దు చేసిన సుప్రీంకోర్టు
  • 142 ఆర్టికల్ కిందున్న అధికారాలతో సంచలన తీర్పు 

న్యూఢిల్లీ: పోక్సో కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తి శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సంపూర్ణ న్యాయం చేయడం కోసం ఆర్టికల్ 142 కింద తనకున్న అధికారాలను వినియోగించి ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపింది. ఈ కేసులోని విలక్షణత, వాస్తవాలు, ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 

ఈ కేసులో కామం లేదని.. ప్రేమ ఉందని న్యాయస్థానం పేర్కొన్నది. న్యాయం కోసం కొన్ని సార్లు చట్టం తలవంచాల్సి ఉంటుందని తెలిపింది. ఈ తీర్పును ఇతర కేసులకు ఉదాహరణగా పరిగణించ కూడదని సూచించింది. ఈ కేసులో ఒక అమ్మాయి మైనర్​గా ఉన్నప్పుడు ఒక వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. కేసు విచారించిన కోర్టు అతనికి ఆరేండ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత అతను ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి ఏడాది వయస్సున్న బాబు ఉన్నాడు. 

ఆ బాధితురాలు ఇప్పుడు మేజర్ అయింది. తన భర్తతో సంతోషంగా జీవించాలను కుంటున్నానని. అతన్ని జైలులో ఉంచితే తన కుటుంబం దెబ్బతింటుందని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన న్యాయమూర్తులు జస్టిస్​ దీపాంకర్ దత్త, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ బెంచ్ శనివారం ఈ సంచలన తీర్పు ఇచ్చింది.

పిల్లల కస్టడీపై.. 

భారతీయుడైన భర్తను వదిలేసి కొడుకుతో సహా రష్యన్ మహిళ తన దేశానికి పారిపోయింది. కొడుకు కస్టడీ కోసం భారత్​కు చెందిన సైకత్ బసు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 

తన భార్య విక్టోరియా మాస్కో వెళ్లడానికి రష్యన్ ఎంబసీ అధికారులు సాయం చేశారని ఆరోపించారు. శనివారం విచరణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా పిల్లవాడి కస్టడీకి ప్రయత్నించాలని విదేశాంగ శాఖ అధికారులకు సూచించింది.