- రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ, బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు, యూటీల సీఎస్‌లు హాజరుకావాలని ఆదేశం
- తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: వీధి కుక్కల నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దేశంలో కుక్కల దాడులతో జనం చనిపోతున్నారంటూ విదేశీయులు మనల్ని చులకనగా చూస్తున్నారని మండిపడింది. దీంతో దేశ ప్రతిష్ట దెబ్బ తింటున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)– 2023 నిబంధనల అమలుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ, బెంగాల్ మినహా నివేదికలు సమర్పించని అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు తదుపరి విచారణకు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. నవంబర్ 3 న జరిగే తదుపరి విచారణకు హాజరుకాకపోతే భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
రాష్ట్రాలు, యూటీలపై బెంచ్ ఆగ్రహం..
ఓ న్యూస్ పేపర్ లో ‘నగరాన్ని వణికిస్తున్న వీధికుక్కలు.. మూల్యం చెల్లిస్తున్న చిన్నారులు’ శీర్షిక పేరుతో వచ్చిన కథనం ఆధారంగా జులై 28న జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ బెంచ్ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆగస్టు 11న జరిగిన విచారణ సందర్భంగా.. కుక్కకాటు, రేబిస్ సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం.. ఢిల్లీ- ఎన్‌సీఆర్ పరిధిలో వీధి కుక్కలను తక్షణమే పట్టుకుని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అగ్రెసివ్‌గా ఉండే కుక్కలను స్టెరిలైజేషన్ చేసినా సరే తిరిగి ఆ ప్రాంతాల్లో వదిలిపెట్టరాదని స్పష్టంచేసింది. కుక్కలను పట్టుకోవడాన్ని ఎవరైనా అడ్డుకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలనీ సూచించింది. అయితే, సుప్రీం ఆదేశాలపై జంతు ప్రేమికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆగస్టు 11నాటి టూ మెంబర్ బెంచ్ ఉత్తర్వులను ఆగస్టు 22న ముగ్గురు జడ్జిల బెంచ్ సవరించింది. వీధి కుక్కలకు నులి పురుగుల నిర్మూలన చేయడంతోపాటు, టీకాలు వేసిన తర్వాత డాగ్ షెల్టర్ల నుంచి రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ రూల్స్ అమలుపై రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని అన్ని రాష్ట్రాలు/యూటీలను ఆదేశించింది. సోమవారం ఈ పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. తెలంగాణ, బెంగాల్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) మినహా మిగతా రాష్ట్రాలు, యూటీలు నివేదికలు సమర్పించకపోవడం, కనీసం తమ తరఫున అడ్వకేట్లను కూడా పంపకపోవడంపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది: జస్టిస్ విక్రమ్ నాథ్
అన్ని రాష్ట్రాలకు తాము నోటీసులు ఇచ్చామని, ఈ ఆర్డర్ గురించి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగినా స్పందించకపోవడం ఏమిటని విచారణ సందర్భంగా రాష్ట్రాలు, యూటీల తీరుపై జస్టిస్ విక్రమ్ నాథ్ ఫైర్ అయ్యారు. దేశంలో నిరంతరం కుక్కల దాడులు జరుగుతున్నాయని, దీనివల్ల విదేశీయుల దృష్టిలో మన దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని కామెంట్ చేశారు. ఢిల్లీ (ఎన్‌సీటీ) సర్కార్ ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయలేదని అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) అర్చనా పాఠక్ దవేను జడ్జి ప్రశ్నించారు. ‘‘ఎన్‌సీటీ ఎందుకు అఫిడవిట్ వేయలేదు? మీ ఆఫీసర్లు న్యూస్ పేపర్లు, సోషల్ మీడియా చూడరా? అందరూ దీన్ని రిపోర్ట్ చేశారు. విషయం తెలిశాక కూడా స్పందించకపోతే ఎలా?’’ అని ఫైర్ అయ్యారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ స్వయంగా రావాలని ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘డిఫాల్ట్ అయిన రాష్ట్రాల సీఎస్‌లు అందరూ నవంబర్ 3న కోర్టుకు రావాలి. లేదంటే, మేం ఈ కోర్టును ఆడిటోరియంలో నిర్వహించాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే భారీ ఫైన్లతో పాటు బలవంతపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
మనుషులపై క్రూరత్వం..
కుక్కలపై జరుగుతున్న క్రూరత్వం గురించి ఒక అడ్వకేట్ వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా.. బెంచ్ అడ్డుకున్నది. ‘‘మనుషులపై జరుగుతున్న క్రూరత్వం సంగతేంటి? మానవ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వక్క ర్లేదా?” అని ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో వ్యక్తులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు పిటిషన్లు వేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
