ఎందుకీ ఉచిత పథకాలు..? ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఇలా ఇష్టమొచ్చినట్లు ఉచితాలు ప్రకటిస్తున్నారు.. డబ్బుల్లేకున్నా, అభివృద్ధిని పక్కన పెట్టి మరీ ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు.. ఇది దేశ ఆర్థిక వృద్ధి ఆటంకం కాదా..? ఉచితాల కంటే ఉపాధి అవకాశాలు కల్పించొచ్చు కదా..? ఇవి అల్లాటప్పా వాళ్లు చేసిన వ్యాఖ్యలు కాదు.. తమిళనాడు ఉచిత పథకాలపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు.
ఉచిత హామీ పథకాలపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.లబ్దిదారుల ఆర్థికస్థితి గతులతో సంబంధం లేకుండా ఉచిత పథకాలను అందించడమేంటని ప్రశ్నించింది.చాలా రాష్ట్రాలు అభివృద్దిని పక్కన పెట్టి, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉచితాలను ప్రకటిస్తు్న్నాయి..ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ విద్యుత్ బోర్డు పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఆదాయ లోటు లో ఉన్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కన పెట్టి పెద్ద ఎత్తున ఉచితాలను ప్రకటిస్తున్నాయి. ఇలా ఉచితాలు ప్రకటించుకుంటూ పోతే దేశ ఆర్థిక వృద్దికి ఆటంక ఏర్పడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. పెద్ద ఎత్తున ఉచిత పథకాలు ప్రకటించడం వల్ల దేశ ఆర్థికాభివృద్ది దెబ్బతింటున్నదని పేర్కొంది.
ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకు ఉచిత ఆహారం , సైకిళ్ల పంపిణీ వంటి పథకాలను అందించడం కంటే ఉపాధి అవకాశాలు సృష్టించడం , స్థిరమైన వృద్దికి మార్గాలను సృష్టించడంపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని కోర్టు సూచించింది.
