సంజయ్ కుమార్ మిశ్రాను మూడోసారి పొడిగించడం ఇల్లీగలే..!

సంజయ్ కుమార్ మిశ్రాను మూడోసారి పొడిగించడం ఇల్లీగలే..!
  •    ఈడీకి ఈసారి కొత్త చీఫ్​ను  నియమించండి
  •     కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం  

న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాను ఆ పదవిలో మూడోసారి పొడిగించడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చింది. ఈడీకి కొత్త చీఫ్​ను నియమించాలని ఆదేశించింది. ఈడీ డైరెక్టర్ గా మిశ్రా 2018 నవంబర్​లో బాధ్యతలు చేపట్టారు. 2020లోనే ఆయన  రిటైర్ అవ్వాల్సి ఉంది. కానీ 2020​లో ఒకసారి, ఆ తర్వాత 2021​లో రెండోసారి, 2022లో మూడోసారి ఆయన పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం ఈ మేరకు తీర్పు చెప్పింది. మిశ్రా పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం 2021 నాటి తీర్పుకు విరుద్ధమని స్పష్టం చేసింది. 

కేంద్రం ఆందోళన 

అంతర్జాతీయంగా టెర్రరిజానికి నిధులు అందకుండా అడ్డుకునేందుకు ఏర్పాటైన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)లో పీర్ రివ్యూ మీటింగ్ జరగాల్సి ఉందని, అందులో మిశ్రా పాల్గొని దేశం తరఫున మనీలాండరింగ్, టెర్రర్ ఫండింగ్ నివారణకు చేపట్టిన చర్యలను వివరించాల్సి ఉందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. యునైటెడ్ నేషన్స్ వంటి వేదికలపై అపార అనుభవం ఉన్న ఆయనను అర్ధాంతరంగా పదవి నుంచి తొలగించడం ఎఫ్ఏటీఎఫ్ లో దేశ ప్రయోజనాలకు భంగకరమని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు విన్న తర్వాత మిశ్రాను మూడోసారి పొడిగించడం సరికాదని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.