బలవంతపు మత మార్పిడితో ముప్పే

బలవంతపు మత మార్పిడితో ముప్పే

న్యూఢిల్లీ: బలవంతపు మత మార్పిడులను చాలా తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీటిని అరికట్టకపోతే దేశ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. మోసపూరిత వాగ్ధానాలతోనో, డబ్బు ఆశ చూపించో మత మార్పిడికి పాల్పడుతున్న ఘటనలు దేశంలో రోజూ ఏదో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. ఈమేరకు బలవంతపు, మోసపూరిత మత మార్పిడులను అరికట్టేందుకు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని అడ్వొకేట్ అశ్విని కుమార్​ ఉపాధ్యాయ్​ ఈ పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం జడ్జిలు జస్టిస్​ ఎం.ఆర్. షా, జస్టిస్​ హిమా కోహ్లీల బెంచ్ సోమవారం విచారించింది.

సీరియస్​ చర్యలు తీస్కోవాలె..

దేశ భద్రతకూ ముప్పు పొంచి ఉన్న క్రమంలో బలవంతపు మతమార్పిడుల అంశాన్ని సీరియస్​గా పరిగణించాలని సుప్రీం బెంచ్​ సూచించింది. మోసపూరితంగా మతమార్పిడులకు పాల్పడుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతాను ఆదేశించింది. ఎస్జీ మెహతా స్పందిస్తూ.. బలవంతపు మతమార్పిడులను అరికట్టడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉందని చెప్పారు. ఈ విషయంపై రాజ్యాంగ పరిషత్తులోనూ చర్చ జరిగిందని పోలీసులు చెప్పారు.

ఒడిశా, మధ్యప్రదేశ్​లో ప్రత్యేక చట్టాలు..

మతమార్పిడుల క్రమబద్ధీకరణకు ఒడిశా, మధ్యప్రదేశ్​ ప్రత్యేక చట్టాలను రూపొందించుకున్నాయని ఎస్జీ మెహతా తెలిపారు. బలవంతపు మతమార్పిడులకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేశాయన్నారు. అలాంటి ఘటనల్లో మతమార్పిడి చట్టబద్ధమేనా కాదా అనేది ఈ కోర్టు తేలుస్తుందన్నారు. కాగా, మాయమాటలతో మతమార్పిడులకు పాల్పడుతున్న వారికి తాము చేసేది నేరమని తెలియదని మెహతా తెలిపారు.

మత స్వేచ్ఛకు అడ్డంకి..

రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛ హక్కుకు కూడా ఈ బలవంతపు మతమార్పిడులతో భంగం కలుగుతు న్నట్లే నని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో తన వైఖరిని తెలియజేయ డంతో పాటు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ఇకపై తీసుకోబోయే చర్యల వివరాలతో కౌంటర్​ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బెంచ్​ ఆదేశించింది. కౌంటర్​ దాఖలుకు ఈ నెల 22 వరకు టైమిస్తున్నట్లు పేర్కొంది. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.