కాలుష్యంపై సుప్రీం సీరియస్.

కాలుష్యంపై సుప్రీం సీరియస్.

నేషనల్ కేపిటల్ సిటీ ఢిల్లీలో పొల్యూషన్​పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ–ఎన్సీఆర్ లో పొల్యూషన్ తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలో పొల్యూషన్ పై వాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది. పొల్యూషన్ తగ్గించేందుకు సమర్ధంగా చర్యలు తీసుకోవాలని, ఢిల్లీలోని 13 పొల్యూషన్ హాట్ స్పాట్​లను క్లియర్ చేయాలని చెప్పింది. సరి బేసి విధానం అమలులో టూ వీలర్లు, త్రీ వీలర్లకు మినహాయింపునివ్వడంపై ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ సిస్టమ్ అమలులో ఉన్నా ఢిల్లీలో పొల్యూషన్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై వాదనలు వినిపించిన ఢిల్లీ ప్రభుత్వం.. తన సరి బేసి పథకం పొల్యూషన్ ను తగ్గించడంలో సాయపడిందని, గడ్డికి నిప్పంటించడం వల్లే పొల్యూషన్ కంట్రోల్ కావట్లేదని కోర్టుకు తెలిపింది. ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు ఎయిర్ ఫిల్టర్ టవర్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని కోర్టుకు వివరించింది.