కన్వర్ యాత్ర..దాబాలపై యజమానుల పేర్లెందుకు?

కన్వర్ యాత్ర..దాబాలపై యజమానుల పేర్లెందుకు?
  • నేమ్​ ప్లేట్ ఏర్పాటు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే 
  • వండి వడ్డించేటోళ్లు ఎవరైతేనేం అని ప్రశ్నించిన కోర్టు
  • ఆహార పదార్థాల పేర్లు రాస్తారని సుప్రీం కోర్టు బెంచ్ కామెంట్​

న్యూఢిల్లీ: కన్వర్ యాత్ర మార్గంలో దాబాలు, తోపుడు బండ్లు, తినుబండారాల దుకాణాలమీద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దుకాణదారులు వారు తయారుచేసిన ఫుడ్స్ పేర్లను మాత్రమే ప్రదర్శిస్తారని, యజమానుల పేర్లను కాదని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్​తో పాటు ఇదేరీతిలో ఆర్డర్స్ పాస్ చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టు సోమవారం నోటీసులు ఇచ్చింది.

వండి వడ్డించెటోళ్లు ఎవరైతేనేం..

ఫుడ్ స్టాళ్లపై తప్పనిసరిగా యజమానులు, అందులో పనిచేసేవాళ్ల పేర్లను ప్రదర్శించాల్సిందేనంటూ యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పోలీసు కమిషనర్లు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. యాత్రకు వెళ్తున్న భక్తులు ప్యూర్ వెజ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునేందుకే ఈ కండిషన్ పెట్టినట్లు యూపీలోని ముజఫర్ నగర్ పోలీసులు ఇచ్చిన వివరణపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఆదేశాల వెనుక మత వివక్ష దాగుందంటూ పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు. వాటికి చట్టబద్ధత లేదని వాదనలు వినిపించారు.

ఈ పిటిషన్లపై విచారణ అనంతరం.. దుకాణదారులు వారిదగ్గర ఏం లభిస్తుందో ప్రదర్శిస్తారు కానీ, వండి వడ్డిస్తున్నోళ్ల పేర్లను బయటపెట్టాలని బలవంతం చేయకూడదని జస్టిస్ హరికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ భట్టి తన గత అనుభవాన్ని పంచుకున్నారు. తాను కేరళలో జడ్జిగా ఉన్నప్పుడు ఓ ముస్లిం నడుపుతున్న శాఖాహార హోటల్ కు వెళ్లేవాడినని, ఫుడ్ స్టాండర్డ్స్, సేఫ్టీ విషయంలో ఆయన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటించేవాడని గుర్తుచేశారు. పక్కనే హిందూ నడుపుతున్న వెజ్ హోటల్ ఉన్నప్పటికీ, తాను మెనూ, మెయింటనెన్స్ చూసి ముస్లిం నడిపే హోటల్​కే పోయేవాడినని చెప్పుకొచ్చారు. కేసు విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు.