ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం కోర్టు

ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం కోర్టు

ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో ఇటీవలే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గురువారం (జులై 24) సుప్రీం కోర్టు స్టే విధించింది. 

బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా స్టే విధించింది.  ప్రభుత్వ పిటిషన్ పై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును హోల్డ్ లో పెట్టింది. 

2006లో జరిగిన ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు సోమవారం (జులై 21) నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తుది తీర్పును బాంబే హైకోర్టు సోమవారం వెల్లడించింది. 2006లో ముంబై లోకల్ రైళ్లలో పేలుడు ఘటనలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. 800 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో సుదీర్ఘ విచారణ అనంతరం తుది తీర్పును బాంబే కోర్టు స్పెషల్ బెంచ్లోని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చంద్రక్ సోమవారం వెలువరించారు.

ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసు:

2006 జులై 11వ తేదీన ముంబై లోకల్ ట్రైన్స్లో 11 నిమిషాల వ్యవధిలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ప్రెషర్ కుక్కర్స్ బాంబులు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మొదటి పేలుడు సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు జరిగింది. ఆఫీస్లకు వెళ్లి లోకల్ ట్రైన్స్లో ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులతో లోకల్ ట్రైన్స్ కిక్కిరిసి ఉన్న సమయం అది.

రెండో బాంబు బ్లాస్ట్ 6 గంటల 35 నిమిషాల సమయంలో జరిగింది. చర్చ్ గేట్ నుంచి వెళుతున్న ట్రైన్స్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్లో దుండగులు బాంబులను అమర్చి ఈ దుశ్చర్యకు పాల్డడ్డారు. మాతుంగ రోడ్, మహీమ్ జంక్షన్, బాంద్రా, ఖర్ రోడ్, జోగేశ్వరి, బొరివాలి రైల్వే స్టేషన్ల దగ్గర ఈ పేలుళ్లు జరిగాయి. ఈ కేసులో అరెస్టై జైల్లో మగ్గుతున్న 12 మందిపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడం గమనార్హం.