కవిత బెయిల్ పిటిషన్​పై తీర్పు రిజర్వ్

కవిత బెయిల్ పిటిషన్​పై తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది. కవితకు గత వారం విధించిన 7 రోజుల కస్టడీ ముగియడంతో శనివారం ఆమెను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఈ మేరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను ఈ నెల 26వ తేదీ ఉదయం11 గంటలలోపు తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. 

ఈడీ కస్టడీ ముగిసిన రోజే బెయిల్ పిటిషన్ విచారించాలని స్పెషల్ జడ్జిని కవిత తరఫు అడ్వకేట్ రాణా కోరారు. అరెస్టు అయి, కస్టడీలో ఉన్న వ్యక్తి నుంచి కొన్ని పత్రాలను ఈడీ కోరుతోందని, బెయిల్ ఇచ్చి బయటకు పంపకుండా ఆ పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఫస్ట్ హియరింగ్ లోనే వివరణాత్మక వాదనలు వినిపించామన్నారు. దీంతో ఈడీ తరఫు అడ్వకేట్ జోహెబ్ జోక్యం చేసుకుంటూ.. ఆ వాదనలను కోర్టు తిరస్కరించిందన్నారు.

 కవిత తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని రాణా కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ పిటిషన్ కు విచారణార్హత లేదని జోహెబ్ వాదించారు. అయితే, ఈడీ లేదా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నా.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉందని రాణా చెప్పారు. ఈ పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు ఈడీకి ఐదు రోజుల సమయం సరిపోతుందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న స్పెషల్ జడ్జి కావేరీ బవేజా తీర్పును రిజర్వ్ చేశారు.