
బ్రెయిన్ డెడ్ అని పంపించేసిన ఓ ప్రైవేటు హాస్పిటల్
ఊపిరి ఉందని గ్రామంలో వైద్యం చేయించిన అమ్మ
కోలుకుంటున్న కొడుకు
సూర్యాపేట రూరల్, వెలుగు:అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తమకిక లేకుండా పోతున్నాడని తల్లి తల్లడిల్లింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే గ్రామస్థుల, బంధుమిత్రులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంబులెన్సు నుంచి కిందకు దించి.. కొనఊపిరి ఉండంతో కార్యక్రమాలు వాయిదా వేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అలాగే ఉండడంతోపాటు ఏడుస్తూ అమ్మ పిలిచిన పిలుపులకు ఆచేతనంగా ఉన్న కండ్లలోంచి నీరు కారడం గుర్తించారు. స్థానిక ఆర్‌ఎంపీని పిలిచారు. అతను హైదరాబాద్‌లో తనకు తెలిసిన డాక్టర్ల సూచనల మేరకు నాలుగు రోజులు వైద్యం అందించారు. స్పృహలోకి వచ్చిన అతను అందరితో మాట్లాడుతూ.. మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు.
సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామానికి చెందిన గంధం సైదమ్మకు ఇద్దరు కొడుకులు. 14 సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందడం తో కూలీ చేసి కొడుకులను చదివిస్తుంది. పెద్ద కొడుకు సాయి డిగ్రీ పూర్తి చేయగా రెండో కొడుకు కిరణ్ సూర్యాపేటలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. జూన్ 26న కిరణ్‌కు వాంతులు, విరేచనాలు కాగ స్థానిక ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. డాక్టర్ల సలహా మేరకు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వారి హైదరాబాద్‌లోని ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌కు రెఫర్ చేయడంతో జూన్ 28న అక్కడికి తీసుకెళ్లారు. 29వ తేదీ తెల్లవారుజామున మెరుగైన చికిత్స కోసమని వనస్థలిపురంలోని మరో హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ మూడు రోజుల ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లు పరిస్థితి విషమించి బ్రెయిన్‌డెడ్ అయిందని, వెంటిలేటర్ తీసిన కొద్దిసేపటల్లో చనిపోతాడని చెప్పి డిశ్చార్జ్ చేశారు.
కొడుకు బయటకు తీసుకురాగనే సైదమ్మ ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. హైదరాబాద్ నుంచి అంబులెన్స్‌లో బయలుదేరారని సమాచారం అందుకున్న గ్రామస్థుల, బంధుమిత్రులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసారు. గ్రామానికి చేరుకున్న అంబులెన్సు నుంచి అచేతనంగా ఉన్న కిరణ్ దించారు. శ్వాస కొనసాగుతుండడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తెల్లారి మధ్యాహ్నం వరకు గుండె కొట్టుకోవడం.. తల్లి కొడుకా.. కొడుకా.. అని పిలుస్తూ ఏడుస్తుడంతో కిరణ్ కంటి నుంచి కన్నీరు కారింది. కొడుకు బతుకుతాడనే ఆశ కలిగిన సైదమ్మ గ్రామంలోని ఓ ఆర్ఎంపీని పిలిచి వైద్యం చేయాలని కోరింది. అతను హైదరాబాద్‌లో తనకు తెలిసిన డాక్టర్ల సూచనలతో ట్రీట్‌మెంట్ అందించారు. నాలుగు రోజుల ట్రీట్‌మెంట్ తరువాత ఐదో రోజు ఈనెల 5న కిరణ్‌లో కదలికలు వచ్చాయ. అదే రోజు రాత్రి కొద్దికొద్దిగా చూడడం, మాట్లాడటం మొదలు పెట్టాడు. చనిపోతాడని భావించిన కొడుకు బతకడంతో తల్లి ఆనందానికి హద్దులు లేవు.