
తాగు, సాగు నీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నామని.. కెమికల్ ఇండస్ట్రీ పెట్టొద్దంటూ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామస్థులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జేసీ, డీఆర్వోను అడ్డుకున్నరు. మీటింగ్ కోసం వేసిన టెంటు కూల్చి కుర్చీలు విసిరేసి ఆందోళనకు దిగారు. ఓ బల్క్ డ్రగ్ అండ్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు భూసేకరణ, ఏర్పాటుపై గురువారం ప్రజాభిప్రాయ సేకరణకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. కెమికల్ ఇండస్ట్రీ ఏర్పాటును ముందునుంచి వ్యతిరేకిస్తున్న స్థానికులు మీటింగ్ ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టెంటు కూల్చివేశారు. కూర్చీలు విసిరికొట్టారు.
ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన జేసీ సంజీవరెడ్డి, డీఆర్వో చంద్రయ్యను అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి కెమికల్ పరిశ్రమ వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇప్పటికే ఈ ఏరియాలో నీరంతా కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని.. మరో కెమికల్ ఇండస్ట్రీ వద్దంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు త్రీవంగా శ్రమించాల్సి వచ్చింది. విధ్వంసాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కొవద్దని.. మీరు చెప్పాలనుకున్నది ప్రజాభిప్రాయ సేకరణలో వివరించాలని జేసీ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. మీటింగ్ ప్రారంభమైన తరువాత వారి అభిప్రాయలు వెల్లడించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ 18 మంది అభిప్రాయాల్ని నమోదు చేశామని, మరో అరవై వినతి పత్రాలు అందాయని చెప్పారు. మీటింగ్ వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, జిల్లా కాలుష్య నియంత్రణా మండలి అధికారి భిక్షపతి, కోదాడ ఆర్డీవో కిషోర్ కుమార్ పాల్గొన్నారు.