పాలోళ్లే హంతకులు.. సోలిపేట హత్య కేసును ఛేదించిన పోలీసులు

పాలోళ్లే హంతకులు.. సోలిపేట హత్య కేసును ఛేదించిన పోలీసులు
  • భూతగాదాలే హత్యకు కారణం
  • ఐదుగురు నిందితులు అరెస్ట్

సూర్యాపేట, వెలుగు: భూమి గెట్టు తగాదాల కారణంగా ఓ వ్యక్తిని తమ పాలోళ్లే హత్య చేశారు. సోలిపేటలో మేకల జయరాములు హత్య కేసును సూర్యాపేట పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం వెల్లడించారు. జయరాములు తనకు వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల భూమిని గతంలో తమ్ముడు కృష్ణయ్యకు కౌలుకు ఇచ్చాడు. తర్వాత తిరిగి భూమిని తీసుకుని తానే సాగు చేయడం మొదలుపెట్టాడు. భూమి, గెట్టు, ఇంటి హద్దుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో కృష్ణయ్యతో పాటు అతడి భార్య లక్ష్మమ్మ, కొడుకు కిరణ్, కోడలు మౌనిక, మరో వ్యక్తి రామచంద్రు కలిసి జయరాములును హత్య చేయాలని ప్లాన్​ చేశారు. సోమవారం సాయంత్రం జయరాములు పొలం వద్దకు వెళ్తుండగా గ్రామ ఆర్చ్ సమీపంలో అడ్డగించి గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. 

హత్య అనంతరం నిందితులు గ్రామం విడిచి పారిపోయారు. పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్ ను ఎస్పీ అభినందించారు.