- సూర్యాపేట జిల్లాలోని సిమెంట్ పరిశ్రమల్లో కరువైన రక్షణ చర్యలు
- గాయపడిన, చనిపోయిన కార్మికులకు అందని సాయం
- ఆందోళనకు దిగితే తప్ప స్పందించిన యాజమాన్యాలు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. 5 స్టార్ రేటింగ్ ఉంటున్నా.. ఆ స్థాయిలో భద్రతాప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కార్మికుల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా ఫ్యాక్టరీల యాజమాన్యాలు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. మరో వైపు ప్రమాదాలు జరిగిన టైంలో చనిపోయిన కార్మికులకు పరిహారం ఇచ్చే విషయంలో కూడా అలసత్వం వహిస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన పరిశ్రమలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కూడా ఆఫీసర్లు చర్యలు చేపట్టడం లేదు.
30 వేల మంది కార్మికులు
హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో పదుల సంఖ్యలో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మంది పనిచేస్తున్నారు. ఇక్కడి సిమెంట్ పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. పరిశ్రమల్లో ప్రమాదం జరిగి కార్మికులు గాయపడినా, చనిపోయినా యాజమాన్యాలు తూతూమంత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి. కొన్ని పరిశ్రమల్లో అయితే గాయపడిన కార్మికులకు కనీస వైద్యసేవలు కూడా అందించడం లేదు. కార్మికులకు ఈఎస్ఐ పేరిట ఆసుపత్రి సౌకర్యం, పీఎఫ్ నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి. ఇక కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వీరికి ఎలాంటి వైద్య సేవలు, పీఎఫ్ అందకపోవడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. అదే రోజు ప్రమాదం
మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఓ సిమెంట్ సంస్థకు సేఫ్టీ, సిమెంట్ ఉత్పత్తిలో ఉత్తమ ప్రమాణాలు పాటించిందంటూ ఇటీవల ఓ ప్రైవేట్ ఏజెన్సీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఆ రేటింగ్ వచ్చిన రోజే కంపెనీలో ప్రమాదం జరిగి ఓ కార్మికుడి చూపుడు వేలు విరిగిపోయింది. 5 స్టార్ రేటింగ్ వచ్చి సంబరాలు చేసుకుంటున్న తరుణంలోనే ప్రమాదం జరిగిందని తెలిస్తే చెడ్డ పేరు వస్తుందన్న భయంతో సదరు సిమెంట్ కంపెనీ యాజమాన్యం ఆ కార్మికుడికి కనీస ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా బయటికి పంపించేసింది.
బాధితుడుహాస్పిటల్ కు వెళ్లేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేదు. అంతే కాకుండా పరిశ్రమ యాజమాన్యానికి, ఈ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని చేతులు దులుపుకుంది. ఆ కార్మికుడు తండ్రి సైతం గతంలో ఇదే సిమెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులు మినహా కంపెనీ నుంచి ఎలాంటి ఆసరా లభించలేదు. చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీకి ఉద్యోగం ఇస్తున్నామని చెప్పి.. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్నారు. ప్రస్తుతం ప్రమాదం బారినపడిన ఆ యువకుడిని కంపెనీ పట్టించుకపోవడం సరికాదని తోటి కార్మికులు మండిపడుతున్నారు.
ధర్నా చేస్తేనే పరిహారం
సిమెంట్ పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులకు ఎలాంటి పరిహారం అందడం లేదు. బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనలు, ధర్నాలు చేస్తే తప్ప పరిహారం ఇచ్చేందుకు యాజమాన్యాలు ముందుకు రావడం లేదని పలువురు అంటున్నారు. పాలకవీడు మండలంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో ఇటీవల ప్రమాదం జరిగి మేళ్లచెరువు మండలం రేవూరుకు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోయాడు.
అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో నష్టపరిహారం కింద రూ.30 లక్షలు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. తర్వాత కంపెనీపై ఎలాంటి కేసు కాకుండా చూసుకుంది. కొన్ని కంపెనీల్లో ప్రమాదాలు జరిగితే ఆందోళనకు దిగే వారిపై పోలీసులతో దాడి చేయిస్తూ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గతేడాది హైదరాబాద్ సమీపంలోని సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు ప్రభుత్వం రూ. కోటి చొప్పున చెల్లించింది. ప్రమాదానికి కారణమైన కంపెనీపై కేసు నమోదు చేసి, కంపెనీ ఎండి సహా పలువురిని జైలుకు పంపించింది. అదే మాదిరిగా సూర్యాపేట జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు సైతం న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
