- సూర్యాపేట మీదుగా దూరం ఎక్కువవుతుందని మారిన అలైన్‌మెంట్
- మాల్, హాలియా, దాచేపల్లి మీదుగా కొత్త రూట్
- రూట్ మార్పుతో ప్రజలు, అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రం రైలు కూత వినాలన్న ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఏళ్ల తరబడి రైల్వే లైన్ కోసం ఎదురుచూస్తున్న జిల్లావాసులు.. కనీసం బుల్లెట్ ట్రైన్‌తోనైనా ఆ కల నెరవేరుతుందని ఆశపడ్డారు. కానీ మొన్నటిదాకా సూర్యాపేట మీదుగా వెళ్తుందనుకున్న హైదరాబాద్– -చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ అలైన్‌మెంట్ మారింది.
సూర్యాపేట కాకుండా నల్లగొండ జిల్లా హాలియా, దాచేపల్లి మీదుగా వెళ్లేలా రూట్‌ను మార్చేశారు. దీంతో జిల్లావాసులకు అన్యాయం జరిగిందని స్థానికులు, అఖిలపక్ష నేతలు ఉద్యమ బాట పట్టారు.
బడ్జెట్‌లో బుల్లెట్ ట్రైన్ రూట్ ప్రకటన
ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైలు కారిడార్లను ప్రకటించారు. అందులో హైదరాబాద్– -చెన్నై కారిడార్ ఒకటి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఫ్యూచర్ సిటీ మీదుగా నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, నందిగామ, ఏపీ రాజధాని అమరావతి, అక్కడి నుంచి చెన్నై వరకు ఈ లైన్ వెళ్తుందని ప్రతిపాదించారు.
ఎన్‌హెచ్-65కు సమాంతరంగా ఈ రూట్ ఉంటుందని, సూర్యాపేటలో స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారని ఆశపడ్డారు. ఈ ప్రాంతం కమర్షియల్‌గా డెవలప్ అవుతుందని, యువతకు ఉద్యోగాలొస్తాయని అంతా సంబరపడ్డారు. కానీ ఇప్పుడు అలైన్‌మెంట్ మార్చడం నిరాశకు గురిచేస్తోంది.
అఖిలపక్షాల ఆందోళనలు
సూర్యాపేటకు రైల్వే లైన్ రాకుండా అలైన్‌మెంట్ మార్చడంపై స్థానికంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అన్నిపార్టీల నాయకులు కలిసి సూర్యాపేట బుల్లెట్ రైల్ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కలెక్టరేట్ ముందు ధర్నాలు నిర్వహించిన కమిటీ నేతలు.. త్వరలో ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి అలైన్‌మెంట్ మార్పును అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
సూర్యాపేట మీదుగానే బుల్లెట్ రైలు వెళ్లేలా చూడాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనాపూరి కాలనీ దగ్గర జాతీయ రహదారి65 పై అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించేంతవరకు అలుపెరుగని ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు.
గతంలో ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను చేర్చినప్పటికీ, ప్రస్తుతం పరిశీలిస్తున్న మూడో అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను తొలగించడం జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లాలో గత 20 ఏండ్లుగా రైల్వే మార్గం కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఐదు దశాబ్దాలుగా రైల్వే సౌకర్యం కోసం సూర్యాపేట ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
దూరం తగ్గుతోందని..
జపాన్‌కు చెందిన షికాన్సెన్ టెక్నాలజీతో గంటకు 350 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి అమరావతికి 70 నిమిషాల్లోనే వెళ్లొచ్చు. ఇటీవల అలైన్ మెంట్ మార్పు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నల్గొండ మీదుగా రూట్‌ను ప్రతిపాదిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపింది. ఈ అలైన్‌మెంట్ ప్రకారం శంషాబాద్, ఫ్యూచర్ సిటీ నుంచి మాల్, మల్లేపల్లి, హాలియా, వాడపల్లి మీదుగా దాచేపల్లికి, అక్కడి నుంచి అమరావతికి బుల్లెట్ రైలు వెళ్లనుంది.
పాత రూట్‌తో పోలిస్తే ఈ రూట్‌లో 123 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా సాగర్ సమీపంలో ప్రభుత్వం ప్రతిపాదించిన 400 ఎకరాల డ్రైపోర్టుకు ఈ లైన్ అనుసంధానం చేయడం వల్ల సరుకు రవాణాకు ఈజీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ కూడా ఇక్కడ సులభమనే సాకుతో సూర్యాపేటను ఈ అలైన్‌మెంట్‌ను నుంచి పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది
