ఒకే వారంలో మూడు సార్లు: జమ్మూ బార్డర్‎లో పాక్ వరుస కవ్వింపులు

ఒకే వారంలో మూడు సార్లు: జమ్మూ బార్డర్‎లో పాక్ వరుస కవ్వింపులు

శ్రీనగర్: నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. బార్డర్‎లో పదే పదే డ్రోన్లును ఎగరేస్తూ రెచ్చగొడుతోంది. ఈ వారం మొదట్లో నౌషేరా, రాజౌరి, కేరీ సెక్టార్లలో పాక్ డ్రోన్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే గురువారం (జనవరి 15) రాత్రి పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి రెండు పాక్ డ్రోన్ సంచరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది. యాంటి డ్రోన్ ఆపరేషన్ చేపట్టింది. 

భారత దళాల ప్రతిఘటనతో తోకముడిచిన డ్రోన్లు తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్‌ఓసి, అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంబడి పాక్ డ్రోన్ల అనుమానస్పద కదలికల నేపథ్యంలో భారత సాయుధ దళాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. సరిహద్దులో భద్రతను కట్టదిట్టం చేశాయి. పాక్ డ్రోన్ల సహయంతో అక్రమంగా ఇండియాలో ఆయుధాలను సరఫరా చేయడం లేదా కీలకమైన సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తోందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.  

Also Read : ఇరాన్లో ప్రభుత్వం మారితే భారత్కు నష్టం.. పాక్, చైనాకు లాభం.. ఎందుకంటే.. ?

ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.  బుధవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లోని సౌత్ వెస్ట్రన్ కమాండ్‌లో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. తాత్కాలికంగా నిలిపివేయబడిందని పేర్కొన్నారు. పాక్ ఏదైనా దుస్సాహసానికి ఒడిగిడితే తగిన విధంగా బదులిచ్చేందుకు రెడీగా ఉన్నామని హెచ్చరించారు. 

ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే ఎల్వోసీ వెంబడి పాక్ డ్రోన్ల కదలికలు పెరిగాయి. వారంలోనే మూడు సార్లు బార్డర్‎లో డ్రోన్లు సంచరించడం గమనార్హం. మరోవైపు ఎల్వోసీ వెంబడి డ్రోన్ల కదలికలపై భారత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాక్, ఇండియా డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో డ్రోన్ల సంచారంపై ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.