పారిస్ లౌవ్రే మ్యూజియంలో చోరీ కేసులో నిందితుల అరెస్టు..!

పారిస్ లౌవ్రే మ్యూజియంలో చోరీ కేసులో నిందితుల అరెస్టు..!

పారిస్: ప్రపంచంలోనే ప్రసిద్ధ లౌవ్రే మ్యూజియంలో ఇటీవల దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్​చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. మ్యూజియంలో కిరీటంతో పాటు పలు ఆభరణాల చోరీ జరిగిన వారం తర్వాత ఈ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు పారిస్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం దర్యాప్తు అధికారులు వారిద్దరిని అరెస్టు చేశారని చెప్పారు. 

అరెస్టయిన వారిలో ఒకరు రోయిస్సీ ఎయిర్​పోర్ట్​నుంచి దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే, ఈ కేసులో ఎంతమందిని అరెస్టు చేసింది పారిస్ ప్రాసిక్యూటర్ లారె బెక్కువా తెలపలేదు. 

కాగా, గత ఆదివారం ఉదయం లౌవ్రే మ్యూజియంలో కేవలం ఎనిమిది నిమిషాలలోపే 88 మిలియన్ యూరోల (102 మిలియన్ డాలర్లు) విలువైన ఆభరణాలను దుండగులు దొంగిలించారు. నిందితుల కస్టడీ వ్యవధి ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయని బెక్కువా తెలిపారు. దొంగలు మొత్తం ఎనిమిది వస్తువులను ఎతుకెళ్లారు. వాటిలో 19వ శతాబ్దపు రాణులు మేరీ -అమేలీ, హార్టెన్స్‌‌లకు సంబంధించిన సప్ఫైర్ డయాడెమ్, నెక్లెస్, ఒక జత కమ్మలు ఉన్నాయి.