
ఫిల్మ్ నగర్లో కోటి రూపాయల వజ్రాభరణాల చోరీ కేసులో నిందితుడు అంజిని పోలీసులు అరెస్టు చేశారు. పవన్ అనే వ్యక్తి సహాయంతో అంజి ఈనెల 20న శమంతక డైమండ్స్‌లో చోరీకి పాల్పడ్డాడు. లాకర్ దొంగిలించి రోడ్ నంబర్ 13 లోని స్మశాన వాటికలో ఓపెన్ చేసి.. కోటి రూపాయల వజ్రాభరణాలు పవన్, అంజి పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పంచుకున్న వజ్రాభరణాలు మన్నప్పురంలో తాకట్టు పెట్టారని పోలీసులు తెలిపారు. వీరి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బెంగుళూరు అక్కడి నుంచి గోవా వెళ్లినట్టు గుర్తించారు. గంజాయికి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.
ఫిలింనగర్‌లోని శమంతక డైమండ్స్ షాపులో భారీ చోరి జరిగిన విషయం తెలిసిందే.. పవన్ కుమార్ అనే వ్యక్తి శమంతక డైమండ్స్ షాపు నిర్వహిస్తున్నాడు. గుజరాత్‌లోని సూరత్ నుంచి బంగారం ముడి సరుకు తీసుకువచ్చి.. ఆర్డర్స్ పై ఆభరణాలు తయారు చేయించి ఇస్తుంటాడు. యజమాని పవన్ గోల్డ్ షాపుకు తాళం వేసి.. బంగారం ముడి సరుకును లాకర్ లో పెట్టి వెళ్లాడు. మరుసటి రోజు షాపుకు వచ్చి లాకర్‌ను ఓపెన్ చేసి చూసేసరికి బంగారం ముడి సరుకు కనిపించలేదు. దీంతో కంగారుపడిన పవన్.. షాపులో అన్ని చోట్ల వెతికాడు. చివరకు బంగారం ముడి సరుకు చోరీకి గురైందని గుర్తించాడు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు బాధితుడు పవన్ సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనలో కోటి రూపాయల విలువ చేసే డైమండ్స్, ముడి సరుకు చోరీకి గురైనట్లు పవన్ కుమార్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్ని పట్టుకున్నారు.