10 గంటలుగా ఈడీ ఆఫీసులోనే కవిత.. కొనసాగుతున్న ఉత్కంఠ

10 గంటలుగా ఈడీ ఆఫీసులోనే కవిత.. కొనసాగుతున్న ఉత్కంఠ

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతుంది. పది గంటలుగా ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు అధికారులు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోకి వెళ్లగా.. రాత్రి ఎనిమిది గంటల 30 నిమిషాల వరకు ఆఫీసులోనే ఉండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మధ్యలో కవిత అడ్వకేట్లు ముగ్గురు ఆఫీసులోకి వెళ్లటం.. ఆ తర్వాత ఇద్దరు వైద్య సిబ్బంది వెళ్లి రావటం వంటి పరిణామాలతో.. ఉత్కంఠ కొనసాగుతుంది. 

మహిళలను సాయంత్రం ఆరు గంటల తర్వాత విచారించకూడదని.. ఈడీ నిబంధనలు ఇవే చెబుతున్నాయంటూ కవిత ఇటీవల సప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మనీలాండరింగ్ కేసు విచారణలో.. ఇంటి దగ్గరే మహిళలను విచారించాలన్న నిబంధనను సైతం తన పిటీషన్ లో ప్రస్తావించారు కవిత. ఈ పరిణామాలన్నింటి క్రమంలోనూ.. కవితను రాత్రి ఎనిమిది గంటల 30 నిమిషాల వరకు ఆఫీసులోనే విచారణ కొనసాగించటం వెనక కారణాలు ఏంటీ అనేది ఆసక్తిగా మారింది. 

మరో వైపు ఈడీ ఆఫీసు పరిసరాల్లో హై టెన్షన్ నెలకొంది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా ఢిల్లీ పోలీసులకు చెందిన ఎస్కార్ట్ వెహికల్స్ సైతం రావటం ఆసక్తిగా మారింది. మొదటి విచారణ సమయంలోనూ రాత్రి 8 గంటలకే బయటకు వచ్చేశారు కవిత. ఇప్పుడు మాత్రం అంతకు మించి ఎక్కువ సమయం ఈడీ ఆఫీసులోనే ఉండటం చూస్తుంటే.. ఏం జరగబోతుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది.

మార్చి 20వ తేదీ విచారణలో మాత్రం మనీష్ సిసోడియా, అమిత్ అరోరాలతో కలిపి కవితను విచారించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈడీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని మీడియాకు ఇవ్వలేదు. విచారణ ఎన్ని గంటలకు పూర్తవుతుంది.. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మరో వైపు ఢిల్లీలో వర్షం పడుతుంది.