గణపతి ఎక్కడ?..తెలంగాణ పోలీసులతో టచ్‌‌లో ఉన్నాడా? త్వరలోనే లొంగిపోతాడా?

గణపతి  ఎక్కడ?..తెలంగాణ పోలీసులతో టచ్‌‌లో ఉన్నాడా? త్వరలోనే లొంగిపోతాడా?
  • రాష్ట్ర పోలీసులతో టచ్‌‌లో ఉన్నాడా? త్వరలోనే లొంగిపోతాడా? 
  •     మావోయిస్ట్ పార్టీ తొలి ప్రధాన కార్యదర్శి సరెండర్​పై సస్పెన్స్‌‌
  •      హిడ్మా ఎన్‌‌కౌంటర్‌‌‌‌, అగ్రనేతలు, పార్టీ కేడర్ లొంగిపోవడంతో మొదలైన చర్చ 
  •     గణపతి అడవుల్లో లేడు.. బయట షెల్టర్‌‌‌‌ తీసుకుంటున్నాడు: డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డి
  •     త్వరలోనే మరికొంత మంది మావోయిస్టులు లొంగిపోతారని వెల్లడి

హైదరాబాద్‌‌,వెలుగు: మావోయిస్టు పార్టీ తొలి ప్రధాన కార్యదర్శి, అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌‌ గణపతి లొంగుబాటుపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఓ వైపు ఆపరేషన్ కగార్, మరోవైపు అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆయన లొంగుబాటు ప్రక్రియపై పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో చర్చమొదలైంది. దశాబ్దాల కాలంగా అజ్ఞాత జీవితం గడిపిన తిప్పిరి తిరుపతి అలియాస్‌‌ దేవ్‌‌జీ, మల్లా రాజి రెడ్డి, బడే చొక్కారావు అలియాస్‌‌ దామోదర్‌‌, నూనె నర్సింహారెడ్డి సహా సెంట్రల్ కమిటీ మెంబర్లు పోలీసులకు లొంగిపోవడంతో.. ఆ తర్వాత వంతు గణపతిదేనని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గణపతి గురించి డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.  గణపతి అడవుల్లో లేడని, బయట షెల్టర్‌‌ తీసుకుంటున్నాడనే‌‌ సమాచారం ఉన్నదని డీజీపీ వెల్లడించడంతో.. ఆయన లొంగుబాటుకు కూడా రంగం సిద్ధమైందనే సంకేతాలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో సరెండర్​ ఒక్కటే తనకు అనుకూలమైన మార్గంగా ముప్పాల లక్ష్మణరావు భావిస్తున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. గణపతి లొంగిపోతే రాష్ట్రంలో ఇక మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతరించుకు పోతుందనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

పార్టీని ముందుండి నడిపి..

పీపుల్స్‌‌ వార్‌‌‌‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముప్పాల లక్ష్మణరావు అలియాస్‌‌ గణపతి.. 20‌‌04లో సీపీఐ ఎంఎల్‌‌ మావోయిస్టు పార్టీ అవతరించిన తర్వాత కూడా ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. పొలిట్‌‌బ్యూరో, కేంద్రకమిటీ సభ్యులు కలిసి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాటి నుంచి ముప్పాల లక్ష్మణరావు 15 ఏండ్లపాటు పార్టీని వివిధ రాష్ట్రాలకు విస్తరించారు. అనారోగ్య కారణాల వల్ల గణపతి ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో నంబాల కేశవరావు బాధ్యతలు చేపట్టారు. ముప్పాలతోపాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వర్‌‌రావు అలియాస్‌‌ కిషన్‌‌ జీ, మల్లోజుల వేణుగోపాల్‌‌రావు అలియాస్‌‌ సోనూ, పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌‌ చంద్రన్న, మల్లా రాజిరెడ్డి, జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి, శీలం నరేశ్‌‌, కరీంనగర్‌‌ జిల్లాకు చెందిన నల్ల ఆదిరెడ్డి అలియాస్‌‌ శ్యామ్‌‌, కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి తదితరులు సెంట్రల్ కమిటీల స్థాయిలో పనిచేశారు. కాగా, ఎన్‌‌కౌంటర్‌‌లో  నంబాల కేశవరావు అలియాస్‌‌ బసవరాజు మృతి చెందారు. ఆ పదవిలో తిరుపతి కొనసాగారు. హిడ్మా సహా వరుస ఎన్‌‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు కేడర్‌‌‌‌ మొత్తం అడవులను వీడి  జనజీవన స్రవంతిలో కలుస్తున్నది.

గణపతి దారెటు?

ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండేండ్లుగా ఆపరేషన్‌‌ కగార్‌‌ నిర్వహిస్తున్నది. కర్రెగుట్టలు సహా మావోయిస్టుల కంచుకోటలను కేంద్రబలగాలు జల్లెడ పడుతున్నాయి. కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి నిరుడు సెప్టెంబర్‌‌లో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో మృతి చెందగా.. కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌‌రావు అలియాస్‌‌ సోనూ సహా 70మంది మావోయిస్టులు మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌ ఎదుట లొంగిపో యారు. ఈ క్రమంలోనే మరో సెంట్రల్‌‌ కమిటీ మెంబర్‌‌‌‌ పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌‌ చంద్రన్న కూడా డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డి సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. హిడ్మా ఎన్‌‌కౌం టర్‌‌, అగ్రనేతల లొంగుబాట్ల నేపథ్యంలో గణపతి కూడా లొంగిపోతారని ప్రచారం జరుగుతు న్నది. కాగా, కీలక కేసుల్లో నిందితుడిగా ఉన్న గణపతి కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌‌(ఆర్‌‌‌‌ఏడబ్ల్యూ) కూడా సెర్చ్‌‌ ఆపరేషన్‌‌ నిర్వహిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో గణపతి దారెటనే చర్చ కొనసాగుతున్నది.