టీఆర్‌ఎస్‌లో చేరిన స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌

టీఆర్‌ఎస్‌లో చేరిన స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌

శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆ ఇద్దరు నేతలు తిరిగి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. స్వామిగౌడ్ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడారని, దాసోజు శ్రవణ్ పాలిటిక్స్ లో సెల్ఫ్ మేడ్ లీడర్ అని కేటీఆర్ అన్నారు. వీరిద్దరూ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పని చేశారు. 

తెలంగాణా రావాలని గట్టిగా కొట్లాడం : స్వామిగౌడ్ 

తెలంగాణ రావాలని ఉద్యమంలో గట్టిగా కొట్లాడామని ఆనాటి సందర్భాలను స్వామి గౌడ్ గుర్తు చేసుకున్నారు. అందరి పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. విభజన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతోనే బీజేపీలో చేరానని, కానీ ఏ ఆశయం కోసం పార్టీలో చేరానో అవి నెరవేరడం లేదని, అందుకే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరానని స్వామిగౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలిగే లీడర్ కేసీఆర్‌ మాత్రమేనని, ఆయన నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తామని చెప్పారు. 

చివరి శ్వాస వరకూ కేటీఆర్ తోనే : దాసోజు శ్రవణ్  

తన అనాలోచిత నిర్ణయాల వల్ల టీఆర్ఎస్ పార్టీని వీడానని దాసోజు శ్రవణ్ అన్నారు. మళ్లీ ఏడు సంవత్సరాల తరవాత సొంతగూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆశలు, ఆకాంక్షలతో బీజేపీలోకి వెళ్లానని, అందులో కొందరు నాయకులు మూస రాజకీయాలు చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. దేశానికి తలమానికంగా కేసీఆర్‌ తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు. నవ భారత నిర్మాణం కోసం ఉడుతా భక్తిగా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా శ్రవణ్ తెలిపారు. చివరిశ్వాస ఉన్నంత వరకూ కేటీఆర్ కు అండగా ఉంటామని వెల్లడించారు.