బ్రేకింగ్: గుర్గావ్‌ చేరుకున్న మిడతల దండు

బ్రేకింగ్: గుర్గావ్‌ చేరుకున్న మిడతల దండు

న్యూఢిల్లీ: పంటలను నాశనం చేసే ఎడారి మిడతల దండు దేశ రాజధాని ఢిల్లీకి పక్కనే ఉన్న గుర్గావ్‌కు చేరుకుంది. గుర్గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో వేలాది మిడతలు ఆకాశాన్ని కప్పేసిన వీడియోలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. గుర్గావ్‌లోని పలు ప్రాంతాల్లో విస్తరించిన మిడతలు.. కొన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లనూ కవర్ చేశాయి. అక్కడి బిల్డింగ్‌ల్లో ఉంటున్న కొందరు ప్రజలు మిడతలు దండు వ్యాపించి ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

గుర్గావ్‌లో నిత్యం రద్దీగా ఉండే ఎంజీ రోడ్, ఐఎఫ్‌ఎఫ్‌సీవో చౌక్ ఏరియాల్లో కూడా మిడతలు వ్యాపించాయి. అలాగే డీఎల్‌ఎఫ్ ఫేజ్ 1–4, చక్కర్‌‌పూర్ విలేజ్, సికందర్‌‌పుర్, సుఖ్రలీ ప్రాంతాలూ మిడతల సమూహంతో నిండిపోయాయి. మిడతల దండు నుంచి సురక్షితంగా ఉండాలని రైతులకు సోనెపట్‌ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మిడతల దాడిని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని గత నెలలో హర్యానా చీఫ్ సెక్రటరీ కేశిని ఆనంద్ అరోరా అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్‌కు ఆదేశించారు.

అయితే మిడతల రాక గురించి తమకు అధికారులు ఎలాంటి ముందస్తు సూచనలు, హెచ్చరికలు జారీ చేయలేదని గుర్గావ్‌ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆఫ్రికాకు చెందిన ఎడారి మిడతలు ఇరాన్‌, పాకిస్తాన్‌ల మీదుగా ఇండియాకు చేరుకున్నాయి. వీటికి విపరీతమైన ఆకలి ఉంటుంది. మొక్కలను తినే మిడతలు.. తనిఖీ చేయకుండా వదిలేస్తే పంటలను కూడా నాశనం చేస్తాయి.