భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సుప్రభాత సేవ తర్వాత మూలవరులకు ఆవు పాలు, నెయ్యి, పంచదార, తేనె, పెరుగుతో అభిషేకం, మంజీరా(పసుపు ముద్ద)లు అద్ది తిరుమంజనం చేశారు. అభిషేకం తర్వాత స్వామివారిని అలంకరించి భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. బంగారు పుష్పాలతో అర్చన జరిపించారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేయగా, భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు.
త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి, ఛత్తీస్‌గఢ్ ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్ట్ మంత్రి కేదార్ కశ్యప్రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో దామోదర్‌రావు ఆధ్వర్యంలో అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం సీతారామయ్యకు దర్బారు సేవ నిర్వహించారు. అంతకుముందు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.నోరి దత్తాత్రేయుడు కుటుంబ సమేతంగా సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈవో, అర్చకులు పరివట్టం కట్టి ఆయనకు స్వాగతం పలికారు. ప్రాకార మండపంలో వేదపండితులు ఆయన ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.
