మెయ్‌‌‌‌పాడంతో జీవితాన్ని గెలిచింది

మెయ్‌‌‌‌పాడంతో జీవితాన్ని గెలిచింది

జీవితాంతం అన్నింట్లో తోడుగా ఉంటానన్న భర్త, బిజినెస్‌‌‌‌లో లాస్‌‌‌‌ వచ్చిందని వదిలేసి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌‌‌‌ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తోచక విపరీతంగా ఏడ్చింది. జీవితంపై ఆశని, ధైర్యాన్ని కోల్పోయింది. ఆ టైంలోనే మెంటల్ ఫిట్‌‌‌‌నెస్ క్లాస్‌‌‌‌లో జాయిన్‌‌‌‌ అయింది. తరువాత ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ట్రైనర్‌‌‌‌‌‌‌‌గా మారి, ఇప్పుడు ఇంటర్నేషనల్‌‌‌‌ ట్రైనర్ అయింది.

తమిళనాడులోని సత్యమంగళం ఊళ్లో ఉంటుంది 33 ఏండ్ల స్వాతి కృష్ణన్‌‌‌‌. మెయ్‌‌‌‌పాడం, కర్లకట్టై అనే ట్రెడిషనల్‌‌‌‌ విద్యను నేర్చుకుంది. ఈ విద్యల్ని ఇంతకుముందు సైనికులు ప్రాక్టీస్‌‌‌‌ చేసేవాళ్లు. ఇవి కూడా ఒక రకమైన యోగా, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టైప్‌‌‌‌ ట్రైనింగ్​మాదిరివే.  2020లో ఆ విద్య నేర్చుకునేందుకు స్టూడెంట్‌‌‌‌గా వెళ్లిన స్వాతి, ఇప్పుడు మొదటి మహిళా ఇంటర్నేషనల్‌‌‌‌ కోచ్‌‌‌‌, ట్రైనర్‌‌‌‌‌‌‌‌.

అమ్మ అండతో...
అందరినీ కాదని 2018లో పెట్టిన బిజినెస్‌‌‌‌కు నష్టాలు వచ్చాయి. ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోవడంతో 2019లోనే బిజినెస్‌‌‌‌ మూతపడింది. ఆ నిరాశతో స్వాతి భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో డిప్రెషన్‌‌‌‌లోకి వెళ్లిపోయింది. అది చూసిన తల్లి... కూతురు ఏమైపోతుందో అన్న బాధతో ఆమెను దగ్గరకు తీసుకుంది. అండగా నిలిచి, ధైర్యం చెప్పింది. మెయ్‌‌‌‌పాడం ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ క్లాస్‌‌‌‌లకు వెళ్తే మానసికంగా మెరుగుపడతారని తెలుసుకుని, 2020లో ఆ క్లాస్‌‌‌‌లోచేర్చింది కూతుర్ని. తరువాత కొన్ని రోజులకు మెయ్‌‌‌‌పాడంలో భాగమైన కర్లకట్టై కూడా నేర్చుకుంది స్వాతి. అది చూసి అందరూ ‘కర్లకట్టై మగవాళ్లు చేసేది. నువ్వు ఆడపిల్లవు. ఇవన్నీ నీకెందుకు’ అన్నారు. ఆ మాటలేవి పట్టించుకోలేదామె.పట్టుబట్టి 2021కల్లా మెయ్‌‌‌‌పాడం, కర్లకట్టై విద్యలో మొదటి అంచె నేర్చుకుంది. ‘ఇక ఇందులోనే నా జీవితం’ అనుకుంది. తరువాత మిగతా అంచెలను నేర్చుకుంది. సర్టిఫైడ్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ కోచ్‌‌‌‌, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ట్రైనర్‌‌‌‌‌‌‌‌గా మారి ‘యస్‌‌‌‌పీపుల్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌’ను స్థాపించింది. అందులో చాలామందికి మెయ్‌‌‌‌పాడం, కర్లకట్టైని నేర్పుతుంది. వీటిని నేర్చుకునేందుకు ఎక్కువగా యూత్‌‌‌‌, ఉద్యోగులే వస్తున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కూడా క్లాస్‌‌‌‌లు తీసుకుంటోంది.

లాభాలెన్నో...
పాతం కాలంనాటి ఈ విద్యల వల్ల హెల్త్‌‌‌‌, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ పరంగా చాలా లాభాలున్నాయి. గురక, ఫిజికల్‌‌‌‌, మెంటల్‌‌‌‌ స్ట్రెస్‌‌‌‌ తగ్గడానికి, జీర్ణ, నెలసరి సమస్యలు పోవడానికి ఇవి సాయపడతాయి. బరువు తగ్గుతారు. నిద్రలేమి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. సెంట్రల్‌‌‌‌ నెర్వస్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ మెరుగుపడుతుంది. దృఢంగా, బలంగా తయారవుతారు. 

‘ఏ విషయమైనా సరే.. ఎవరో ఏదో అన్నారని ప్రయత్నించకుండా వదిలిపెట్టొద్దు. అనేవాళ్లు, ఎగతాళి చేసేవాళ్లు అలా చేస్తూనే ఉంటారు. వాళ్లని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూపోవాలి. నేను చేసిందీ అదే.  ప్రాచీన కళను అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు, నలుగురికీ నేర్పిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది’ అంటోంది స్వాతి.